అమరవీరుల వారోత్సవాలకు సిద్ధం
● రేపటి నుంచి సీపీఐ(ఎంఎల్) గ్రూప్‌ల ఆధ్వర్యాన సన్నాహాలు ● తొలినాళ్లలో బలమైన వర్గం.. ఆపై చీలికలు ● ఐదు సార్లు ఇల్లెందు ఎమ్మెల్యే స్థానం కై వసం
ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్)లోని వివిధ వర్గాల ఆధ్వర్యాన శుక్రవారం నుంచి నవంబర్ 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్‌లైన్(ప్రజాపంథా)తో పాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలోని వై.కే, చంద్రన్న వర్గాలు ఇందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, సాధినేని వెంకటేశ్వరరావు సారథ్యాన కొనసాగుతున్న వర్గం వై.కే వర్గంలో విలీనం అయ్యేందుకు సిద్ధమైంది. ఫలితంగా ప్రజాపంఽఽథా, వై.కే., చంద్రన్న వర్గాల నేతృత్వాన అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి.
ప్రజలు, కూలీల సమస్యలపై పోరాటం
చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన 1967లో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యాన సాయుధ దళాలను ఏర్పాటు చేసి గోదావరి పరీవాహక ప్రాంతంలో కూలీ రేట్లు, తునికాకు కూలీలు, పోడు రైతుల సమస్యలపై ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపింది. కాగా, పార్టీ ముఖ్యనేతలు చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగిరెడ్డి, పోట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, వెంపటాపు సత్యం, ఆదిబట్ల కై లాసం, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, చేరాలు తదితరులు వేర్వేరు సంవత్సరాల్లో నవంబర్ నెలలోనే అసువులు బాసారు. దీంతో ఏటా నవంబర్‌లో అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
బలమైన ఉద్యమం
సీపీఐ(ఎంఎల్) నేతృత్వాన 1980 ప్రాంతంలో బలమైన ఉద్యమం ఏర్పాటైంది. ఇల్లెందు అసెంబ్లీ స్థానాన్ని ఐదు సార్లు, సిరిసిల్ల సీటును ఒకసారి కై వసం చేసుకుంది. 1984లో ఎంఎల్ పార్టీలో చీలికలు రాగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇల్లెందు ఏరియాలో ప్రజాపంథాగా, ములుగు ఏరియాలో విమోచనగా పనిచేశాయి. ఆపై 1988లో విమోచనలో మరో చీలిక సంభవించింది. దీంతో రామచంద్రన్ – కూర రాజన్న విమోచన వర్గంగా, ఫణిబాగ్ఛీ– మధుసూదన్‌రాజ్ ప్రతిఘటన వర్గంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. విమోచన వర్గం సిరిసిల్ల కేంద్రంగా పనిచేసి ఎన్వీ.కృష్ణయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. కొంత కాలానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది వర్గాలు కలిసి జనశక్తిగా ఆవిర్భవించాయి. ఇక ప్రతిఘటన వర్గంలో చలమన్న నాయకత్వాన ప్రజాప్రతిఘటన, అందులో నుంచి గోదావరి లోయ ప్రజాప్రతిఘటన వర్గాలు ఏర్పడ్డాయి. కొంత కాలానికే ఆ గ్రూపులన్నీ అంతరించిపోయి ప్రతిఘటన ఒక్కటే మిగిలింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటనలో మళ్లీ రెండు, మూడు గ్రూపులు ఏర్పాటయ్యాయి. జనశక్తి నుంచి ఒక వర్గం సీపీయూఎస్‌ఐ, ఆదివాసీ లిబరేషన్ ఫ్రంట్‌గా ఏర్పడినా ఆతర్వాత కనుమరుగమయ్యాయి.
కీలక నేతల మరణం
ఈ ప్రాంతంలో కీలక నేతలైన చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న) సుభాష్‌చంద్రబోస్(రవి), పూనెం లింగయ్య(లింగన్న), ముక్తార్‌పాషా, రాయల చంద్రశేఖర్ కన్నుమూయడంతో పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న మూడు గ్రూపులకు చెందిన రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, అశోక్ అమరవీరుల సభలను జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఇల్లెందులోని ఎన్డీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, జె. సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు అమరవీరు ల వారోత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నాయకులు గౌని నాగేశ్వరరావు, తోడేటి నాగేశ్వరరావు, సారంగపాణి, మోకాళ్ల రమేష్, కొండపల్లి శ్రీనివాస్ ఇర్పా రాజేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment