కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారు..
ఖమ్మంమయూరిసెంటర్: ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అమలు చేయలేక రోజుకో ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ తెలిపారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావొస్తున్నా హామీల అమలుపై కాలయాపన చేస్తున్నారన్నారు. ఇదేసమయాన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ గుర్తుండిపోతారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడగా బీఆర్‌ఎస్ పోరాటంతో విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఇందిరమ్మ పథకం వర్తింపజేయండి
ఖమ్మం మయూరిసెంటర్/సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేసి పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు గత ప్రభుత్వం రూ.3 లక్షలకు సంబంధించి ప్రొసీడింగ్స్ అందించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ జీఓను రద్దు చేయడంతో పేదలు నష్టపోతున్నందున ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని, రఘునాథపాలెంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు హైవే నిర్మాణంలో కోల్పోతుండడంతో ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, కనగాల వెంకట్రావు, బెల్లం వేణు, వీరూనాయక్, పోగుట్ల వెంకటేశ్వరరావు, అలేఖ్య, రామారావు, కట్ట అజయ్‌కుమార్, కాటమనేని వెంకటేశ్వరరావు, దుగ్గిరాల వెంకట్‌లాల్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, కాటమనేని వెంకటేశ్వరరావు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
తాత మధు
Comments
Please login to add a commentAdd a comment