యంత్రాల వాడకం అంతంతే..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా 24 గనుల్లో ఎక్కడ కూడా 100 శాతం ఉత్పత్తి నమోదు కాక వార్షిక లక్ష్యాల సాధన సాధ్యం కావడం లేదు. దీంతో సంస్థకు రూ.కోట్లలో నష్టం ఎదురవుతోంది. సింగరేణి పరిధిలోని భూగర్భ గనుల్లో 26 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 59.31 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అదే 18 ఓపెన్‌కాస్ట్ గనుల్లో 8 వేల మంది కార్మికులే ఉండగా.. 640 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చింది.
ఎస్‌డీఎల్ ద్వారా అంతంతే..
సింగరేణి సంస్థలో మొదట తట్టాచెమ్మస్ విధానం అమల్లో ఉండగా కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా 2002–03లో సైడ్ డిశ్చార్జ్ లోడర్ (ఎస్‌డీఎల్) యంత్రాలను ప్రవేశపెట్టారు. అయితే, కార్మికులకు నామమాత్రపు శిక్షణే ఇచ్చినా ఆరంభంలో రోజుకు 100 టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఆ తర్వాత కార్మికులకు విదేశాల్లో శిక్షణ ఇప్పించడంతో రోజుకు 142 టన్నుల ఉత్పత్తి సాధించగలిగారు. కానీ ఇప్పుడు రోజుకు 102 టన్నులకు మించి ఉత్పత్తి రాకపోవడం గమనార్హం. సింగరేణిలోని 24 భూగర్భగనుల్లో 18 గనుల్లోనే ఎస్‌డీఎల్ యంత్రాలు నడుస్తుండగా. మిగతా వాటిలో సీఎమ్మార్, లాంగ్‌వాల్ యంత్రాలతో ఉత్పత్తి సాగుతోంది. ఎస్‌డీఎల్‌లు గతంలో సగటున రోజుకు 10.7 గంటలు పనిచేసేవి. ప్రస్తుతం 6.7 గంటలకే పరిమితమైంది. వీటి పని గంటలు కనీసం మరో రెండు గంటలు పెంచగలిగితే మరో 30 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని, తద్వారా నష్టాన్ని అధిగమించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఏంవీటీసీల్లో శిక్షణ కరువు
సింగరేణిలోని ప్రతీ ఉద్యోగికి శిక్షణ ఇచ్చేందుకు మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎంవీటీసీ)లను ఏర్పాటుచేశారు. గనుల్లోని ప్రతీ యంత్రం పనితీరు, మరమ్మతులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించేవారు. అయితే, ప్రస్తుతం ఒకటి, రెండు సెంటర్లు మినహా మిగతా చోట్ల నిపుణులు లేక శిక్షణ సాఫీగా సాగడం లేదు. అంతేకాక సర్ఫేస్ ఉద్యోగం కావాలని వస్తున్న కొందరు అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందడం లేదని చెబుతున్నారు. ఇకనైనా యంత్రాల పని గంటలు పెరిగేలా అధికారులు పర్యవేక్షిస్తే తప్ప భూగర్భగనుల్లో ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం
గతంలో రోజుకు 10.7 గంటల మేర ఎస్‌డీఎల్ యంత్రాలతో పని
ఇప్పుడు సగటున 6.7 గంటలకే
పరిమితం
నానాటికీ తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి
గత కొన్నేళ్లలో ఎస్‌డీఎల్ పని గంటలు, ఉత్పత్తి (సగటున)
సంవత్సరం పని రోజువారీ
గంటలు ఉత్పత్తి
(టన్నుల్లో)
2013–14 8.4 108
2014–15 7.9 107
2015–16 7.8 109
2016–17 7.8 114
2017–18 7.9 104
2018–19 7.6 105
2019–20 7.3 107
2020–21 5.6 79
2021–22 6.7 102
2022–23 7.0 105
2023–24 6.7 102
యంత్రాల పనిగంటలు పెంచాలి
ఉద్యోగులు పనితీరు మార్చుకుని యంత్రాల వినియోగాన్ని పెంచితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. లేనిపక్షంలో కంపెనీ మనుగడ కష్టతరమనే విషయాన్ని అందరూ గుర్తించాలి. భూగర్భ గనుల్లో ఎల్‌హెచ్‌డీలు, ఎస్‌డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచాలి. అప్పుడే 100శాతం ఉత్పత్తి సాధ్యమవుతుంది. – వెంకటేశ్వరరెడ్డి,
సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)
Comments
Please login to add a commentAdd a comment