ఖమ్మం – ఇల్లెందు రోడ్డుకు మహర్దశ
● రూ.38 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరణ ● మిగతా పనులకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు ● రెండు జిల్లాల నడుమ లింక్ రోడ్డు అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారికి మహర్దశ పడుతోంది. రఘునాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు నాలుగు లేన్లుగా విస్తరణ, డివైడర్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.38 కోట్ల నిధులతో చేపడుతున్న ఈ పనులకు కొన్నాళ్ల క్రితం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయగా.. ఇటీవలే రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు. ఖమ్మం నుంచి రోడ్డును విస్తరిస్తూ మూడు విడతల్లో రఘునాథపాలెం వరకు పూర్తిచేశారు. తాజాగా రఘునాథపాలెం నుంచి మరో 6.5 కి.మీ. మేర రోడ్డు విస్తరణ, డివైడర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు బూడిదంపాడు సమీపం వరకే సరిపోతుండగా, ఖమ్మం నియోజకవర్గం పరిధిలోనే మరో 2 కి.మీ. మేర నిర్మాణానికి నిధులు కేటాయించాల్సి ఉంది.
మిగతా పనులకు కూడా..
ఖమ్మం నియోజకవర్గంలో మిగిలిన 2 కి.మీ.తో పాటు ఇల్లెందు నియోజకవర్గ పరిధి లింగాల క్రాస్ వరకు మిగిలిన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు సుమారు రూ.40 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈ నిధులు కూడా మంజూరైతే ఇల్లెందు – ఖమ్మం మధ్య ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి.
నానాటికీ పెరుగుతున్న రద్దీ
ఈ రహదారిలో నిత్యం వందలాదిగా బస్సులు, లారీలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తోడు ఇల్లెందులో ఉత్పత్తి అయ్యే బొగ్గును లారీల ద్వారా తరలించేది ఈ రహదారి మీదుగానే కావడంతో రద్దీగా ఉంటోంది. అంతేకాక ప్రతీ బుధవారం కామేపల్లి మండలం పండితాపురం వద్ద జరిగే సంతకు వేలాదిగా జనం హాజరవుతుండడంతో తరచుగా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మరోపక్క రఘునాథపాలెంలో విత్తన గిడ్డంగి, గోదాంలు ఉండటం, త్వరలోనే సమీకృత గురుకుల పాఠశాల, స్వామినారాయణ్ పాఠశాలల నిర్మించనున్నారు. ఫలితంగా రద్దీ మరింత పెరుగుతోంది. అయితే, నాలుగు లేన్లుగా ఉన్నంత వరకు ప్రయాణం సాఫీగా సాగుతున్నా డబుల్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రహదారిని విస్తరిస్తుండడం, మిగిలిన ప్రాంతంలోనూ విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించడంతో సమస్యలు తగ్గి రెండు జిల్లాల నడుమ లింక్ రోడ్డు అభివృద్ధి చెందనుంది.
Comments
Please login to add a commentAdd a comment