సాక్షి నెట్‌వర్క్: ఖమ్మం 57వ డివిజన్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 26న హనుమాన్‌చాలీసా పారాయణం, అన్నదానం చేపట్టనుండగా కార్పొరేటర్ ఎండీ.రఫీదా ముస్తఫా రూ.15వేల విరాళం ప్రకటించారు. ఈ నగదును ఎంపీ రేణుకా చౌదరి చేతుల మీదుగా కమిటీ సభ్యులకు అందజేశారు. కాగా, ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కార్పొరేటర్ మలీదు జగన్ కుటుంబాన్ని ఎంపీ రేణుకాచౌదరి పరామర్శించి అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే, శస్త్రచికిత్స చేయించుకున్న రఘునాథపాలెం మండలం చింతగుర్తి మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరరావును కూడా పరామర్శించారు. కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లుతో పాటు సీతారామయ్య, బండి వెంకన్న, యాసా రమేష్, నగేష్, తారాదేవీ, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, కామేపల్లి మండలం తాళ్లగూడెంలో ఎంపీ మాట్లాడుతూ రైతు రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. నాయకులు నల్లమోతు లక్ష్మయ్య, గింజల నరసింహారెడ్డి, మద్దినేని నరసింహారావు, గుజ్జర్లపూడి రాంబాబు, లకావత్ సునీత పాల్గొన్నారు. అలాగే, కారేపల్లి మండలంలోని గంగారంతండాకు చెందిన శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ రెండు నెలల క్రితం ఆకేరు వరద ఉధృతితో మృతి చెందగా, వారి కుటుంబాన్ని ఎంపీ పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా వరదల్లో చిక్కుకుని మృతి చెందిన నాయకన్‌గూడెంకు చెందిన యాకూబ్–సైదాబీ కుమారులను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. నాయకులు శ్రీదేవి, మానుకొండ రాధాకిషోర్, కృష్ణ, మంజుల, చిట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. అంతేకాకుండా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన మాజీ సర్పంచ్ కన్నేటి వెంకన్న ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. నాయకులు కన్నేటి నర్సింహారావు, జ్యోతి, కన్నేటి వెంకటమ్మ పాల్గొన్నారు. కాగా, కొణిజర్ల నుంచి తుమ్మలపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ దొండపాటి రమేష్, కట్ల సత్యం, గడల శ్రీనివాసరావు, కమతం నాగేశ్వరరావు ఎంపీకి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment