ఉద్రిక్తతకు దారి తీసిన దారి పంచాయితీ
నేలకొండపల్లి: మండలంలోని తిరుమలాపురంలో దారి పంచాయితీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా గ్రామంలోని సన్న, చిన్న కారు తమ భూములకు వెళ్లకుండా ఓ రైతు కంచె ఏర్పాటు చేశాడు. అది ప్రభుత్వ భూమి అని గిరిజనులు.. కాదు సొంత భూమి అని సదరు రైతు చెబుతుండగా వివాదం కొనసాగుతోంది. ఈక్రమాన 33 మంది రైతులు 50 ఎకరాల్లో వరి సాగు చేయగా పంట కోసి ధాన్యం తీసుకొచ్చేందుకు దారి లేకుండా పోయింది. దీంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్ జె.మాణిక్‌రావు, ఎస్పై పి.సంతోష్ క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. కంచె వేసిన రైతు నర్సింహారావును పిలిచి దారి ఇవ్వాలని కోరినా ససేమిరా అనడంతో ముందుగా గిరిజన రైతులు పంట తెచ్చేందుకై నా సహకరించాలని కోరారు. దీంతో ఆయన తమ కుటుంబీకులు అడిగి చెబుతానంటూ వెళ్లిపోయారు. కాగా, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మౌలానా, హేమంతరావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, కర్నాటి భానుప్రసాద్, పాల్తీయ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, కనకబండి సీతారాములు తదితరులు చేరుకుని బాధిత రైతులకు మద్దతుగా అధికారులతో చర్చించారు. అయితే, నర్సింహారావు అంగీకరించినా, లేకున్నా శనివారం తాము కంచె తొలగించి పంట కోసి ధాన్యం తీసుకొస్తామని చెప్పడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment