నేడు జిల్లాలో మంత్రి, ఎంపీ పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం బల్లేపల్లి, రఘునాథపాలెంల్లో జరిగే వన సమారాధనలకు హాజరవుతారు. ఆతర్వాత ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి పాల్గొంటారు. ఆతర్వాత ఖమ్మం, మధిరలో వివిధ సంఘాల ఆధ్వర్యాన జరిగే వన సమారాధనలకు హాజరుకానున్నారు. అలాగే, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదివారం ఉదయం 10–30 నుంచి గంట పాటు ఖమ్మం గరంలోని గట్టయ్య సెంటర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆతర్వాత వివిధ ప్రాంతాల్లో జరిగే వన సమారాధనలకు హాజరవుతారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివా రం ఉదయం బాలపేట, గొల్లగూడెం రోడ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. ఆతర్వాత 10–30 గంటలకు వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశాక మధ్యాహ్నం సత్తుపల్లి సెంట్రల్‌పార్క్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, సోమవారం ఉదయం కొత్తగూడెంలో నందా తండా నుంచి దివ్యాంగుల కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, రైటర్‌బస్తీలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మం 4వ డివిజన్ ఖానాపురం హవేలీలో యూపీహెచ్‌సీ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేస్తారు.
జమలాపురంలో
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని శ్రీ వారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈఓ కె.జగన్మోహన్‌రావు, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
వసతి గృహాల్లో
సౌకర్యాలపై ఆరా
నేలకొండపల్లి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలను తెలుసుకునేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని సింగారెడ్డిపాలెం గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి వంట గదులు, భోజనశాలల నిర్వహణ, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. భోజనం మెనూ, తాగునీటి సరఫరాపై ప్రిన్సిపాల్, ఆధ్యాపకులతో పాటు విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం రాజేశ్వరపురం, చెరువుమాధారం, నేలకొండపల్లిలోని వసతి గృహాలను తనిఖీ చేసి నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు డీఐఈఓ తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.పద్మావతి, హాస్టళ్ల అధికారులు రవూఫ్, బాలకృష్ణ, ఓదెలు పాల్గొన్నారు.
రామయ్యకు
సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వేడుక వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ తంతు జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment