ప్రతీ కుటుంబానికి స్మార్ట్‌కార్డు
● సంక్షేమ పథకాల అమలుకు అందులోనే వివరాల నిక్షిప్తం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ కుటుంబానికి స్మార్ట్ కార్డు జారీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందులో ఆ కుటుంబానికి సంబంధించి స్థితిగతులు, ఇతర వివరాలన్నీ ఉంటాయని తెలిపారు. తద్వారా వారి అర్హతల మేరకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలుచేస్తామని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, మద్దులపల్లి, గుర్రాలపాడులో సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి పనులకు మంత్రి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అర్హులైన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ సమయాన ఎన్నికల ప్రచారం చేశామని.. ఇప్పుడు మంత్రిగా ఉండడానికి ఇక్కడి ప్రజల సహకారమే కారణమని తెలిపారు. ఎన్నికల సమయాన ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశామని, మిగతావి త్వరలో అమలవుతాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసినందున వచ్చేనెల మొదటి వారంలో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే నిధులు మంజూరు చేశామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాచలంలో శనివారం పర్యటించిన ఆయన తొలుత శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికిన అర్చకులు పూజల అనంతరం వేదాశీర్వచనం, జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మాఢ వీధుల విస్తరణ, భూసేకరణకు ఇప్పటికే రూ.68 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ముగ్గురు మంత్రుల ఆధ్వర్యాన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలంపై సీఎం రేవంత్‌రెడ్డికి అభిమానం ఉండడంతోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. అనంతరం రామాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment