జోరుగా కొనుగోళ్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ధాన్యం సేకరణ ఊపందుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో మబ్బులు పట్టి.. జల్లులు కురుస్తుండడంతో రైతులు ధాన్యం అమ్మకానికి హడావుడి చేస్తున్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాలకు వేగంగా తరలిస్తున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 344 కొనుగోలు కేంద్రాలు తెరవగా.. అన్ని కేంద్రాల్లోనూ ధాన్యం సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు 19,01,950 క్వింటాళ్ల మేర ధాన్యం కొనుగోలు చేశారు. కాగా, కొందరు రైతులు మిల్లులకు కూడా ధాన్యం తరలిస్తున్నారు.
లక్ష్యం.. 42.96 లక్షల క్వింటాళ్లు
ఈ వానాకాలం సీజన్‌లో రైతులు వరి సాగుపై మొగ్గు చూపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతులు ఈ రకం సాగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాల్లోకి నీరు రావడంతో పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. జిల్లాలో మొత్తం 2,81,991 ఎకరాల్లో వరి వేయగా.. అందులో 2,62,230 ఎకరాల్లో సన్న రకాలే పండించారు. మరో 19,761 ఎకరాల్లో దొడ్డు రకాలు సాగయ్యాయి. మొత్తంగా 67,74,500 క్వింటాళ్లఽ ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన పౌర సరఫరాల సంస్థ అధికారులు.. 42,96,300 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ముందస్తు ప్రణాళికతో..
ఽఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రణాళికాయుతంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సాధారణ ధాన్యం క్వింటాకు రూ.2,300, గ్రేడ్–ఎ (సన్న రకం) ధాన్యానికి రూ.2,320 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇదే అంశంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, బహిరంగ మార్కెట్ కంటే ఈ కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని వివరించారు.
తుపాన్ ప్రభావంతో మరింత వేగం..
ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే మిల్లర్లు కూడా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న రైతులు.. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు హడావుడి పడుతున్నారు. తుపాను ప్రభావం జిల్లాపై కూడా పడుతుండడంతో ధాన్యం విక్రయాలకు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. కొన్నిచోట్ల విక్రయం కోసం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించగా.. మరికొందరు రైతులు కల్లాల్లో ఆరబోసి ఉంచారు. ఇటీవల జల్లులు కురిసిన సమయంలో టార్పాలిన్లు కప్పి రక్షించుకున్నారు. అలాగే చలి విపరీతంగా ఉండటంతో మంచు ప్రభావంతో ధాన్యం తడుస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రైతులు పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో విక్రయించేందుకు ధాన్యాన్ని తరలిస్తున్నారు.
వాతావరణ మార్పులతో ధాన్యం విక్రయానికి రైతుల హడావుడి
మందకొడిగా ప్రారంభమైనా.. ఊపందుకున్న సేకరణ
జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాలు
ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 19,01,950 క్వింటాళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇలా..
మందకొడిగా ప్రారంభమైనా..
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా తొలినాళ్లల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు తక్కువగానే ధాన్యాన్ని తరలించారు. గతనెల 8 నుంచి జిల్లా వ్యాప్తంగా 344 కొనుగోలు కేంద్రాలను ప్రభ్వుం ప్రారంభించినా అంతగా ఫలితం కనిపించలేదు. అయితే సన్నధాన్యానికి బోనస్ ప్రకటించడం, మద్దతు ధర ఉండడంతో ఆ తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పటివరకు 31,223 మంది రైతుల నుంచి 19,01,950 క్వింటాళ్ల ధాన్యాన్ని డీఆర్‌డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సేకరించారు. ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ కూడా ఖాతాల్లో జమ కావడంతో మరింత మంది ముందుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment