‘పేదోళ్ల ప్లీడర్ శంకరన్న’ పుస్తకావిష్కరణ
ఖమ్మం లీగల్ : అర్ధ శతాబ్దానికి పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగిన చల్లా శంకర్ స్మారక పుస్తకం ‘పేదోళ్ల ప్లీడర్ శంకరన్న’ పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది చల్లా శంకర్ తన జీవిత కాలంలో దళితులకు, మహిళలకు వ్యతిరేకంగా కేసులు వేయలేదని అన్నారు. ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు విప్లవ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
మొబైల్ కోర్టు న్యాయమూర్తిగా నాగలక్ష్మి
స్థానిక మొబైల్ కోర్టు న్యాయమూర్తిగా బక్కర నాగలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పరిచయ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ హాజరై మాట్లాడారు. నాగలక్ష్మి కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. న్యాయవాదిగా వరంగల్ బార్‌లో నమోదై ప్రాక్టిస్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాస్, చింతనిప్పు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 12 నుంచి 2 గంటల వరకు ఖమ్మం ప్రజాభవన్‌లో ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. 3.30 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 4.15 గంటలకు మధిర చేరుకుని మధిర, ఎర్రుపాలెం మండల కమిటీ సభ్యులతో మాట్లాడతారు. ఆ తర్వాత బయ్యారంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి మధిరలో బసచేస్తారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు మధిర నుంచి బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ వెళతారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.
మెడికల్ కోర్సుల్లో వార్షిక పరీక్షలు ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన డిప్లొమా విద్యార్థులకు సోమవారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తొలిరోజు మొత్తం 12 కళాశాలలకు చెందిన 436 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పదోన్నతులపై విచారణ
ఖమ్మం సహకారనగర్ : సుమారు ఐదు నెలల క్రితం జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్(స్పెషల్ ఎడ్యుకేషన్)గా పలువురికి పదోన్నతులు లభించాయి. అందులో ఏడుగురి బదిలీలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోమవారం డీఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కాగా, మంగళవారం కూడా విచారణ కొనసాగుతుందని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment