తీగల వంతెన పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మంవన్‌టౌన్: నగరంలో నిర్మిస్తున్న తీగల వంతెన ఖమ్మం గుమ్మానికి మణిహారంగా నిలుస్తుందని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, తీగల బ్రిడ్జి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. మున్నేరు తీగల వంతెన అద్భుతమైన ఆకర్షణతో ఖమ్మానికి ల్యాండ్ మార్క్ కాబోతోందన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 31 లోగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచేలా నిర్మిస్తున్న తీగల వంతెనను కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ వంతెనతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు ఖమ్మం అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. 2026 జనవరిలో అట్టహాసంగా ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం నగరంలోని సూర్యాపేట – అశ్వారావుపేట ప్రధాన రహదారిలో 57/150 –58/400 రహదారిపై ఈ తీగల వంతెన నిర్మిస్తున్నట్లు వివరించారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఎంఎస్ అశోక బిల్డకన్ సంస్థ రూ.180 కోట్లతో ఈ బ్రిడ్జిని 24 నెలల్లో శరవేగంగా నిర్మిస్తోందని మంత్రి కితాబు ఇచ్చారు. మొత్తం 16 ఫౌండేషన్లలో 12 ఫౌండేషన్లు పీఆర్ బెడ్ బాక్సులతో సహా పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను వచ్చే సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించేందుకు డైవర్షన్ రోడ్డును పాత వంతెనకు సమాంతరంగా నిర్మిస్తున్నామని తెలిపారు. డైవర్షన్ రోడ్డు పాత కాజ్ వే ని తారు రోడ్డు గా నిర్మించాలని మంత్రి ఆదేశించారు. వర్షాకాలంలో కూడా ట్రాఫిక్ నియంత్రణకు పాత వంతెనను వాడుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని బైపాస్ రోడ్‌లో గల ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి, ప్రకాష్‌నగర్ వంతెనతో పాటు అన్ని వంతెనల మరమ్మతులు శరవేగంగా చేయాలని సూచించారు.
జిల్లాలో నేడు పర్యటన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రఘునాథపాలెం మండలం దోనబండ, ఈర్లపూడి, కొర్లబోడు తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. బుధవారం ఉదయం 5.45 గంటలకు చర్చ్‌కాంపౌండ్‌లో చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం 9 గంటలకు సత్తుపల్లి మండలం బుగ్గపాడు – నాగుపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి, 10 గంటలకు కాకర్లపల్లిలో బీటీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. కో–ఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభిస్తారు. 11గంటలకు తల్లాడ మండలం నూతన్‌కల్‌లో కో – ఆపరేటివ్ భవన ప్రారంభోత్సవం చేస్తారు. 12 గంటలకు ఖమ్మం 18వ డివిజన్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
2025 చివరి నాటికి బ్రిడ్జి ప్రారంభం కావాలి
బైపాస్, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జీల మరమ్మతులు పూర్తి చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment