అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు
బాలమాయా దేవి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు బి. బాలమాయా దేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓటర్ సవరణ జాబితా 2025 పై అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఓటర్ జాబితా సవరణపై చేపడుతున్న చర్యలను అదనపు కలెక్టర్లు, అధికారులు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటర్ జాబితాలో నూతనంగా నమోదవుతున్న వారి వివరాలను తనిఖీ చేయాలని సూచించారు. ఓటర్ జాబితాకు సంబంధించి వచ్చిన ప్రతి అభ్యంతరం, క్లెయిమ్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. జాబితా నుంచి ఓటు తొలగిస్తే స్పష్టమైన సమాచారం, కారణాలు ఉండాలని, ఓటర్ జాబితా సవరణ పూర్తి పారదర్శకంగా జరగాలని, ప్రతి కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సందర్భంగా ఫారం 6, 6ఏ, 7, 8 దరఖాస్తులు 21,274 రాగా, ఇప్పటివరకు 18,192 దరఖాస్తులు పరిష్కరించామని, 2,977దరఖాస్తులు తిరస్కరించగా, 105 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత నెలలో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్‌లో జిల్లాలో 1,181 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment