నిల్వలు ఫుల్.. ఉపాధి డల్
● భద్రాద్రి జిల్లాలో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ● అయినా సింగరేణిలో తగ్గిపోతున్న కార్మికుల సంఖ్య ● కొత్త గనుల్లేక కళ కోల్పోయిన ఇల్లెందు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత వేగంతో తవ్వకాలు చేపడితే మరో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు గోదావరి–ప్రాణహిత లోయలో ఉన్నాయి. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం రికార్డులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నిక్షేపాల నిల్వల్లో భద్రాద్రి కొత్తగూడెం ద్వితీయ స్థానంలో ఉంది. అయినా జిల్లాలో రోజురోజుకూ సింగరేణి కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో సంస్థ విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో 11,849.54 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 16 ఓపెన్‌కాస్ట్‌లు, 18 అండర్‌గ్రౌండ్ మైన్ల ద్వారా ఉత్పత్తి జరుగుతుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ప్రమాదంలో ఇల్లెందు ఏరియా
సింగరేణి వ్యాప్తంగా మంచిర్యాల తర్వాత అత్యధిక బొగ్గు నిల్వలు భద్రాద్రి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 130 ఏళ్లుగా ఇల్లెందులో, 90 ఏళ్లుగా కొత్తగూడెంలో, 50 ఏళ్లుగా మణుగూరులో బొగ్గు వెలికితీస్తున్నా నిక్షేపాలు తరిగిపోలేదు. జిల్లాలో ఇంకా 3136.70 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అయినా జిల్లాలో సింగరేణి కాంతులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇల్లెందు ఏరియా ఇప్పటికే సింగరేణి ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. మరో 15 ఏళ్లలో మణుగూరులోనూ బొగ్గు తవ్వకాలు ఆగిపోతాయంటూ ఇటీవల సింగరేణి ఉన్నతాధికారుల ప్రకటించారు.
అరువు తెచ్చుకున్న టెక్నాలజీతో..
బొగ్గు తవ్వకాల్లో వందేళ్ల అనుభవం ఉన్న ఇప్పటికీ సింగరేణికి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం పూర్తిస్థాయిలో లేదు. రష్యా, చైనా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో మైనింగ్ రంగంలో అభివృద్ధి చేసిన టెక్నాలజీనే అరువు తెచ్చుకునే పరిస్థితి ఉంది. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దశాబ్దాలుగా సింగరేణి దృష్టి సారించడం లేదు. ఫలితంగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ వెలికి తీయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా స్థానిక పరిస్థితులకు తగిన కొత్త టెక్నాలజీ అభివృద్ధిపై యాజమాన్యం దృష్టి సారించాలి.
కొత్త గనుల్లేక తగ్గుతున్న ఉపాధి అవకాశాలు
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలతో పోల్చినప్పుడు ఇక్కడి నిల్వలు ఎక్కువ లోతులో ఉన్నాయి. భూమి నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ లోతులో బొగ్గు నిక్షేపాలు ఉంటే ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌తో తీయడం సాధ్యం కాదు. భూగర్భ గనుల ద్వారానే వెలికి తీయాల్సి ఉంటుంది. కానీ ఈ విధానంలో బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువనే కారణంతో సింగరేణి కొత్త గనులు ప్రారంభించేందుకు సిద్ధంగా లేదు. దీంతో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా ఇక్కడ ఆశించిన స్థాయిలో కొత్త గనులు రావడం లేదు. ఫలితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇల్లెందు ఏరియాలో కార్మికుల సంఖ్య 300కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment