ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
● 30వేల మిర్చి బస్తాలతో కళకళ
● ధరలో మాత్రం కానరాని పురోగతి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చి బస్తాలతో కళకళలాడింది. మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం 30వేల బస్తాల మిర్చిని రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. ఇందులో ప్రస్తుత సీజన్‌కు సంబంధించి 27,338 బస్తాలతో పాటుఏసీ మిర్చి 1,550 బస్తాలే కాక తాలు మిర్చి ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఈ సరుకే అత్యధికమని అధికారులు వెల్లడించారు. ఈనెల రెండో వారంలో 10 వేల బస్తాలు, సంక్రాంతి తర్వాత 16వ తేదీన 15వేల బస్తాల మిర్చిని తీసుకురాగా సోమవారం అంతకు రెట్టింపు సరుకు వచ్చింది. ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచే కాక ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు కూడా ఇక్కడకు తేజా రకం మిర్చి తీసుకొచ్చారు.
విదేశీ ఎగుమతులు లేక...
మిర్చి విక్రయాలు పెరుగుతున్నా ధరలో ఎలాంటి పురోగతి కానరావడం లేదు. గత నవంబర్ నుంచి విదేశీ ఎగుమతులు పడిపోవడం, చైనా నుంచి ఆర్డర్లు లేకపోవడంతో గత ఏడాది సీజన్‌లో క్వింటాకు రూ.22వేలకు పైగా పలికిన ధర ఈ ఏడాది సీజన్ ప్రారంభం నాటికి గణనీయంగా పడిపోయింది. ఖమ్మం మార్కెట్‌లో తేజా రకం మిర్చికి సోమవారం గరిష్ట ధర రూ.15,300 నమోదు కాగా ఏసీ మిర్చి ధర రూ.14వేలుగా నమోదైంది. కాగా, 16వ తేదీన గరిష్ట ధర రూ.14వేలు ఉండగా సోమవారం 15,300గా నమోదైనా ఈ ధర కొద్దిపాటి సరుకుకే దక్కగా, ఎక్కువ సరుకును రూ.14వేలతోనే కొనుగోలు చేశారు. తేజా రకం మిర్చిని విదేశీ ఎగుమతుల కోసం ఎక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అయితే, ఎగుమతులు మందగించడంతో దేశీయ మార్కెట్ ఆధారంగానే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొనుగోలు చేసే మిర్చిని రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
గత కొద్దినెలలుగా ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధర (గరిష్టంగా రూ.ల్లో)
తేదీ ధర
2024 అక్టోబర్ 3 20,000
నవంబర్ 4 18,300
నవంబర్ 26 16,500
డిసెంబర్ 18 16,200
డిసెంబర్ 31 15,511
ఈనెల 2 14,900
జనవరి 6 15,800
జనవరి 16 14,000
జనవరి 20 15,300
Comments
Please login to add a commentAdd a comment