బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
రఘునాథపాలెం/ఖమ్మం క్రైం: గ్రామ, వార్డుసభలు సాఫీగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల సభలను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. రఘునాథపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన సభల్లో జనం సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచుకొండ సభలో భారీగా హాజరైన జనం లబ్ధిదారులుగా గుర్తించిన వారి ఇళ్లను తమ సమక్షాన పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీంతో జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మ ఇది తుది జాబితా కాదని నచ్చచెప్పారు. అక్కడకు వచ్చిన సీపీ సునీల్‌దత్ సైతం వారికి సర్దిచెప్పారు. మండలంలోని ఇతర చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొనగా గణేశ్వరం సభలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, శివాయిగూడెంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, చింతగుర్తి సభలో అడిషనల్ డీఆర్‌డీఓ శిరీష, మార్కెట్ చైర్మన్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, చింతకాని మండలం నాగులవంచ, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సభలను కూడా సీపీ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment