నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు నేలకొండపల్లి మండలం ముఠాపురం చేరుకోనున్న ఆయన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత కోరట్లగూడెం, కోనాయిగూడెం, పైనంపల్లి, అప్పల నర్సింహాపురం, కట్టుకాచారం, కొంగర, బుద్దారంల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4గంటలకు ఇల్లెందు మండలం లలితాపురం క్రాస్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్ధాపన చేశాక సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే, ఎన్‌టీఆర్ సర్కిల్‌లో బుగ్గవాగు సుందరీకరణ, ఫిల్టర్‌బెడ్ ఏరియాలో మున్సిపల్ గెస్ట్‌హౌజ్‌ను పునర్నిర్మాణ పనులను ప్రారంభించాక మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2వ వార్డులో సీసీ రోడ్లు, గోవింద్ సెంటర్‌లో పీహెచ్‌సీ భవనం, పాకాల రోడ్డులో రోడ్డు విస్తరణ, లైటింగ్ పనులను ప్రారంభించనున్నారు.
ఉద్యోగుల జట్ల ఎంపికకు పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించి క్రీడాజట్ల ఎంపికకు మంగళవారం పోటీలు నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వాలీబాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో పోటీలు ఏర్పాటుచేయగా పురుషులు 30, మహిళా ఉద్యోగులు 20 మంది హాజరయ్యారు. ఎంపిక ప్రక్రియను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్‌లు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, పీడీలు కె.నర్సింహామూర్తి, శ్రీనివాస్ పర్యవేక్షించారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు విద్యార్థులు ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిచనుండగా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతుల వరకు ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక గౌలిదొడ్డి, అలుగునూరులోని సీఓఈల్లో 9వ తరగతి, ఖమ్మం, పరిగిలోని టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ల్లో 8వ తరగతి, రుక్మాపూర్‌లోని సైనిక్ స్కూల్, మల్కాజిగిరిలోని ఫైనాన్స్ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు వచ్చేనెల 1వ తేదీలోపు కులం, ఆదాయం, పుట్టినతేదీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న ఉంటుందని, వివరాలకు https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కలెక్టర్ వెల్లడించారు.
మల్బరీ సాగుకు ప్రోత్సాహం
కల్లూరు: మల్బరీ తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని సెరికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఏ.ముత్యాలు తెలిపారు. కల్లూరులో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రెండెకరాల్లో నాటడానికి 11వేల మొక్కలు అవసరమవుతాయని, వీటిని రూ.2 చొప్పు న వెచ్చించి కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే, రెండెకరాలకు కావాల్సిన మొక్కల కొనుగోలు, రవాణా, దున్నడంతో పాటు ఇతర ఖర్చులపై ప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ నిర్మాణానికి సైతం ఎస్సీ, ఎస్టీలౖకైతే రూ.2,92,500, ఇతరులకు రూ.2.25 లక్షల సబ్సిడీ అందుతుందని తెలి పారు. పట్టు గూళ్లు కిలో ధర ప్రస్తుతం రూ.650 నుంచి రూ.750 ధర పలుకుతున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె.రవికుమార్, శాస్త్రవేత్త వి.చైతన్య, ఉద్యానశాఖ అధికారి జి.నగేష్ పాల్గొన్నారు.
నిధుల మళ్లింపుపై విచారణ
ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్ విభాగానికి సంబంధించి సుమారు రూ.1.82కోట్లు దుర్వినియోగమైనట్లు అధికారులు కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఈ నిధులను కొందరు సిబ్బంది దారి మళ్లించినట్లు గుర్తించగా వారిపై చర్యలు సైతం తీసుకున్నారు. ఈ అంశంపై మంగళవారం రాష్ట్రస్థాయి అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చిన అధికారులు బ్యాంక్ ఖాతాలు, ఇతర రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. నిధులను ఏ ఖాతాలోకి, ఎలా మళ్లించారనే అంశంపై ఆరా తీసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment