గణపేశ్వరా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
● త్వరలోనే కూసుమంచిలోని శివాలయానికి మహర్దశ ● అభివృద్ధి పనులకు రూ.3.30 కోట్లు మంజూరు ● మంత్రి పొంగులేటి చొరవతో అభివృద్ధికి అడుగులు
కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి శివాలయం(గణపేశ్వరాలయం)కు పూర్వవైభవం రానుంది. పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా ప్రభుత్వం నుండి రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈమేరకు అభివృద్ధి పనులు పూర్తయితే ఆలయం పూర్వ శోభ సంతరించుకోనుండగా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
కాకతీయుల కాలంలో నిర్మాణం
కాకతీయుల భక్తిభావానికి మచ్చుతునకగా కూసుమంచి శివాలయం నిలుస్తోంది. క్రీ.శ 11–12వ శతాబ్దంలో కాకతీయుల పరిపాలనలో వెయ్యినొక్కటి శివాలయాల నిర్మాణం చేపట్టగా గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఇక్కడ శివలింగం ఆసియా ఖండలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణాన్ని ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడని ప్రచారంలో ఉండగా, నున్నగా చెక్కిన పెద్దపెద్ద బండరాళ్లను నిలబెట్టిన తీరు అబ్బురపరుస్తుంది. వెయ్యేళ్ల క్రితం నిర్మించినా భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలబడడం విశేషం. శివలింగంపై సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా తీర్చిదిదద్దడం మరో అద్భుతమని చెప్పాలి. అయితే, రానురాను ఆదరణ కోల్పోయి 2001 వరకు కంపచెట్ల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని నాడు కూసుమంచి సీఐగా పనిచేస్తున్న సాధు వీరప్రతాపరెడ్డి గ్రామస్తులు, పెద్దల సహకారంతో దారి ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. ఆ తర్వాత దేవాదాయ, పర్యాటక శాఖలు గుర్తించడంతో కొన్ని సౌకర్యాలు సమకూరాయి. ఆపై మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఈనేపథ్యాన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంపై మంత్రి పొంగులేటికి ఆలయ చైర్మన్ రేలా ప్రదీప్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఏమేం చేస్తారంటే...
ప్రభుత్వం కేటాయించిన రూ.3.30 కోట్లతో ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలిలా ఉన్నాయి. దేవతామూర్తుల కల్యాణం కోసం రూ.26 లక్షలతో మండపం, రూ.1.41 కోట్లతో ప్రాకారం గోడ, రూ.1.25 కోట్లతో శుభద మండపం, రూ.8.50లక్షలతో పాకశాల, రూ.14.50 లక్షలతో ఆర్చీగేటు, రూ.15.50 లక్షలతో కార్యాలయ గది, స్టోర్‌రూం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment