నిరసనలు.. నిలదీతలు
దరఖాస్తుల వెల్లువ
తొలిరోజు జిల్లాలోని 208 గ్రామాలు, ఖమ్మం కార్పొరేషన్‌లోని 20డివిజన్లు, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లోని 22 వార్డుల్లో కలిపి 250 సభలు జరిగాయి. ఇక్కడ అర్హుల జాబితాలు ప్రకటించడమే కాక ఆయా పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. దీంతో 41,282 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 14,783, రేషన్‌కార్డుల కోసం 15,721, రైతుభరోసా కోసం 1,565, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 9,213 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం ఈనెల 26నుంచి అమలుచేయనున్న సంక్షేమ పథకాల అర్హులను ప్రకటించేందుకు నిర్వహించిన గ్రామసభలు తొలిరోజు రసాభాసగా ముగిశాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను మంగళవారం నిర్వహించిన గ్రామ, వార్డుసభల్లో ప్రకటించగా అర్హులకు చోటు దక్కలేదని పలుచోట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొనగా అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తామెందుకు అర్హులం కాదంటూ నిలదీయగా మరోమారు దరఖాస్తులు స్వీకరించి అర్హులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించడంతో శాంతించారు. ఖమ్మంరూరల్ మండలం గోళ్లపాడు, ఖమ్మం ఆరో డివిజన్‌లో జరిగిన సభల్లో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పాల్గొనగా, వివిధ ప్రాంతాల్లో సభలకు సీపీ సునీల్‌దత్ హాజరై బందోబస్తును పర్యవేక్షించారు.
అభ్యంతరాల నడుమ..
నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల జాబితాలను మూడు రోజుల పాటు నిర్వహించే గ్రామ, వార్డుసభల్లో ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. తొలిరోజైన మంగళవారం చాలాచోట్ల నిరసనల నడుమే సభలు కొనసాగాయి. అర్హులకు పథకాలు మంజూరు కాలేదని అధికారులను నిలదీశారు. ఒకే ఇంట్లో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అభ్యంతరం తెలిపారు. పెళ్లి కాని వారికి రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేయగా.. భూమి లేని తమను ఉపాధి కూలీ పనులు చేయలేదన్న కారణంతో ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయకపోవడం సరికాదని పలువురు పేర్కొన్నారు.
అర్హుల గుర్తింపునకే...
గ్రామసభల్లో ప్రజలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. అర్హులకు మాత్రమే పథకాలు వర్తించేందుకే సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సభల్లో వచ్చిన అభ్యంతరాలపై విచారిస్తామని, ఫిర్యాదులు నిజమని తేలితే అనర్హుల పేర్లు తొలగించి అర్హులకే ఇస్తామని చెప్పారు. ఈమేరకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో పలువురు అక్కడికక్కడే దరఖాస్తులు అందజేశారు. పలుచోట్ల పోలీస్ పహారా మధ్య సభలు కొనసాగాయి.
నియోజకవర్గాల వారీగా..
●ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం మంచుకొండ సభలో అర్హులకు పించన్, ఇళ్లు మంజూరు కాలేదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం మూడో డివిజన్‌లో నిర్వహించిన సభలోనూ ఇదే పరిస్థితి ఎదురుకాగా ఒకే ఇంట్లో ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 1నుంచి 20వ డివిజన్లలో సభలు నిర్వహిస్తే చాలాచోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది.
●పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం గట్టుసింగారంలో నిర్వహించిన గ్రామసభను గ్రామస్తులు అడ్డుకున్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని ఆందోళనకు దిగారు.
●సత్తుపల్లి నియోజకవర్గం కిష్టారంలో పెళ్లి కాని వారికి రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ఇళ్లు ఉన్న వారికి కూడా మంజూరు చేశారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వేంసూరు మండలం కుంచపర్తి, భీమవరం సభల్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు కాలేదని అధికారులను పలువురు నిలదీశారు.
●వైరా నియోజకవర్గం దాచాపురం సభలో అర్హులను ఎంపిక చేయలేదని గ్రామస్తులు ఆందోళన చేశారు. కొణిజర్ల మండలం చిన్న మునగాలలో లబ్ధిదారుల పేర్లు అధికారులు చదువుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామసభ ఆమోదం పొందితేనే జాబితా ఖరారవుతుందని అధికారులు చెప్పినా వినకపోవడంతో మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. కారేపల్లి మండలం బజ్జితండా గ్రామసభ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లు మారింది. కాంగ్రెస్ నాయకులు తమ వారి పేర్లను కావాలనే తీయించారని ఆరోపించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సూర్యాతండాలోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల నడుమ వాగ్వాదం జరగగా, వెంకట్యాతండా సభలో జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
●మధిర నియోజకవర్గంలోని ఇల్లూరులో ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు లేవని పలువురు ప్రశ్నించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురంల్లో అర్హులకు రేషన్‌కార్డులు, ఇళ్లు మంజూరు కాలేదని, ఎర్రుపాలెం మండలం జమలాపురం, మీనవోలుల్లో అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు కాలేదని నిలదీశారు. చింతకాని, ముదిగొండ మండలాల్లోని గ్రామాల్లో జరిగిన సభల్లోనూ అధికారులకు ఇదే అనుభవం ఎదురైంది.
తొలిరోజు గ్రామ,
వార్డు సభల్లో ఇదీ పరిస్థితి
నాలుగు పథకాలకు లబ్ధిదారుల జాబితాలు వెల్లడి
అనర్హుల పేర్లు ఉన్నాయంటూ
పలువురి అభ్యంతరాలు
పలు ప్రాంతాల్లో రభస...
నచ్చజెప్పిన అధికారులు
మరోమారు దరఖాస్తులు
స్వీకరించడంతో శాంతించిన జనం
గ్రామ, వార్డుసభల్లో అందిన దరఖాస్తులు
పథకం గ్రామసభలు వార్డు సభలు
ఇందిరమ్మ ఇళ్లు 12,313 2,470
రేషన్‌కార్డులు 13,460 2,261
రైతుభరోసా 1,551 14
ఆత్మీయ భరోసా 9,201 12
మొత్తం 36,525 4,757
Comments
Please login to add a commentAdd a comment