ఆర్టీసీకి సం‘క్రాంతి’
● 12 రోజుల్లో రూ.20.73 కోట్ల ఆదాయం ● సంస్థకు కలిసొచ్చిన పండుగ సర్వీసులు ● రీజియన్‌లో 25.80 లక్షల మంది మేర ప్రయాణం
ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఖమ్మం రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించింది. ఈనెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు షెడ్యూల్ సర్వీసులకు తోడు అదనపు సర్వీసులు తిప్పడంతో సంస్థకు భారీగా ఆదాయం నమోదైంది. పండుగకు వారం రోజులే కాక ఆ తర్వాత వారాంతపు సెలవులు కలిసి రావడంతో 20వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగాయి. ఈ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయగా సంస్థకు భారీగానే లాభాలు వచ్చాయి. మొత్తం 12 రోజుల్లో ఏడు డిపోల పరిధిలో 25.80 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించగా రూ.20.73 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
1,277 బస్సులు
ఈనెల 11నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కాగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 9వ తేదీ నుండే ప్రత్యేక బస్సులు నడిపింది. ఈమేరకు 9నుండి 14వ తేదీ వరకు వరకు హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాలోని మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాలకు బస్సులు నడిపించారు. ఇక 15నుండి 20వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు సర్వీసులు ఏర్పాటుచేశారు. షెడ్యూల్ ప్రకారం నడిచే బస్సులు కాకుండా అదనంగా 1,277 బస్సులను నడిపించడం విశేషం.
30.96 లక్షల కిలోమీటర్లు
సెలవుల్లో ఆర్టీసీ అధికారులు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు మొత్తం 30.96 లక్షల కి.మీ. బస్సులు తిప్పారు. 25.80 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడంతో ఆర్టీసీకి రూ.20.73 కోట్ల ఆదాయం సమకూరింది. రీజియన్‌లో 104 ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదవగా, మహాలక్ష్మి పథకం ద్వారా 15.97 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. కాగా, హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు ఈనెల 11న, తిరుగు ప్రయాణంలో ఈనెల 19న అత్యధికంగా రూ.2.34లక్షల మంది ప్రయాణం సాగించారు. దీంతో ఆ రెండు రోజుల్లో రెగ్యులర్, స్పెషల్ సర్వీసులే కాక 79 చొప్పున అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సంక్రాంతి పండుగకు ఉమ్మడి జిల్లా ప్రజలే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా తమ స్వస్థలాలకు వెళ్లారు. ఫలితంగా సత్తుపల్లి డిపోకు అత్యధికంగా 150 రిజర్వేషన్ బస్సులు నడిపించారు.
రీజియన్‌లో డిపోల వారీగా 12రోజుల్లో ప్రయాణికులు, ఆదాయ వివరాలు
డిపో ప్రయాణికులు ఆదాయం కిలోమీటర్ల ఓఆర్
(లక్షల్లో) (రూ.ల్లో) (లక్షల్లో)
ఖమ్మం 5.41 4,86,69,000 7.57 100.89
మధిర 1.29 2,29,47,000 3.34 109.89
సత్తుపల్లి 6.12 3,73,25,000 5.49 106.16
భద్రాచలం 3.44 3,99,05,000 6.02 100.73
కొత్తగూడెం 3.35 2,22,60,000 3.22 107.89
మణుగూరు 4.16 3,02,32,000 4.30 108.92
ఇల్లెందు 0.99 60,10,000 1.01 105.46
ప్రణాళికాయుతంగా బస్సులు
సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చివెళ్లే ప్రయాణికుల కోసం ప్రణాళికాయుతంగా బస్సులు నడిపించాం. రద్దీని పరిశీలిస్తూ అప్పటికప్పుడు అదనపు సర్వీసులు ఏర్పాటుచేశాం. నిరంతర పర్యవేక్షణతో ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రజల నమ్మకం మేరకు ఆర్టీసీ బస్సుల్లో వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఆర్టీసీ ఖమ్మం రీజియన్
Comments
Please login to add a commentAdd a comment