ఆద్యులెవరు.. బాధ్యులెవరు?
● ఆయిల్‌ఫెడ్ నర్సరీలో బయటపడిన అక్రమాలు కొన్నే ● అధికారుల తీరుతో నిండా మునుగుతున్న రైతులు ● రేగళ్లపాడు నర్సరీ ఘటనపై ఆరా తీసిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి: ఆయిల్‌పామ్ తోటంటే ఒక క్రేజ్.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో సాగుకు ముందుకొస్తున్న రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇందులో 1.50లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. గతంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, సత్తుపల్లి, కల్లూరు మండలాలకే పరిమితమైన సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. ఈనేపథ్యాన రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాల్సిన ఆయిల్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోస్టారికా దేశం నుంచి దిగుమతి చేసుకున్న రూ.3కోట్ల విలువైన మొక్కలు ఇప్పుడు పనికి రాకుండా పోవడంతో ఈ తప్పెవరిదనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎక్కడ పొరపాటు జరిగింది?
సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సీరలో మూడు లక్షలు మొక్కలు పనికిరాకుండా పోవడంపై చర్చ మొదలైంది. కోస్టారికా దేశానికి ఆర్డర్ ఇచ్చిన ఆయిల్‌ఫెడ్ కంపెనీదా.. పిలకమొక్కలు పెంచిన నర్సరీ నిర్వాహకుల లోపమా అన్న అంశం తెలియాల్సి ఉంది. ఆయిల్‌ఫెడ్ నుంచి ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరీక్షలు జరిపాకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో అదే దేశం నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి. అంతేకాక ఆఫ్‌టైప్(నాటడానికి పనికిరాని) మొక్కలు ఎక్కువగా వస్తుంటే ఎప్పటికప్పుడు ఆయా దేశాలకు నివేదిక పంపిస్తూ రికవరీ చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో మొక్కలు ఆఫ్‌టైప్‌గా తేలినా రికవరీ దాఖలాలు లేకపోగా, నర్సరీల్లో విచారణ పేరుతో కాలయాపన చేయడం.. ఒకరిద్దరి అధికారులపై చర్యలు తీసుకుని కప్పిపుచ్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఐదేళ్ల నుంచే ఈ తరహా మొక్కలు
1996 నుంచి అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం నర్సరీకి ఆయిల్‌పామ్ పిలకలను ఇతర దేశాల నుంచి తెప్పించి పెంచాక ఉమ్మడి ఏపీలోని రైతులకు అందించేవారు. అప్పట్లో ఆఫ్‌టైప్ ఫిర్యాదులు పెద్దగా నమోదు కాలేదు. ఎకరానికి ఐదారు మొక్కలు వచ్చినా వాటి స్థానంలో మళ్లీ కొత్తవి ఉచితంగా ఇచ్చేవారు. అయితే, ఐదేళ్లుగా ఆఫ్‌టైప్ మొక్కలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా రైతులకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. ఆయిల్‌పామ్ మొక్క నాటాక మూడేళ్లకు ఏపుగా పెరిగి కాపు మొదలవుతుంది. అప్పటివరకు మొక్క ఆఫ్‌టైపా.. లేదా అన్నది గుర్తించే వీల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉద్యానవన అధికారులు గుర్తించటంతో..
రేగళ్లపాడు నర్సరీలో కోస్టారికా దేశానికి చెందిన ఆయిల్‌పామ్ మొక్కలను ఉద్యానవన అధికారులు భారతి, సూర్యనారాయణ పలుమార్లు తనిఖీలు చేయడంతో ఆఫ్‌టైప్ మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు బయటపడింది. దీంతో రైతులకు పంపిణీ చేయకుండా ఆపడంతో వారికి మేలు చేసినట్లయింది. లేకపోతే విలువైన సమయాన్ని, డబ్బును నష్టపోయేవారు. గతంలో సత్తుపల్లి మండలం నారాయణపురంలో పుచ్చకాయల సోమిరెడ్డి 12 ఎకరాల్లో నాటిన ఆయిల్‌పామ్ మొక్కలు కాపుకు రాకపోవడంతో తొలగించాల్సి వచ్చింది. దీనిపై ఆయిల్‌ఫెడ్ అధికారులు, శాస్త్రవేత్తల బృందం పలుమార్లు పరిశీలించినా ఇప్పటివరకు రైతుకు న్యాయం జరగలేదు.
రాష్ట్ర మంత్రి తుమ్మల ఆరా
రేగళ్లపాడు నర్సరీలో భారీ సంఖ్యలో మొక్కలు పనికిరాకుండా పోయిన అంశం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఏకంగా మూడు లక్షల మొక్కలు ఉపయోగపడవని తేల్చిన నేపథ్యాన ఆయన అధికారుల వివరణ అడిగినట్లు తెలిసింది. ఓవైపు ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే మరోవైపు ఆఫ్‌టైప్ మొక్కలు బయటపడిన అంశంపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment