దీపం.. ఐశ్వర్యం
● నేడు వెలుగుల పండుగ దీపావళి ● ధనలక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ● టపాసుల దుకాణాల వద్ద ప్రజల సందడి
జిల్లా కేంద్రంలో ప్రమిదలు విక్రయిస్తున్న చిరువ్యాపారులు
ఆసిఫాబాద్‌అర్బన్: ఏ శుభకార్యమైనా జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. దీపాన్ని జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటాం. చీకటిని పారదోలి వెలుగులు నింపుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. జిల్లా ప్రజలు గురువారం వెలుగుల పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్లలో ప్రత్యేకంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారులు లక్ష్మీపూజలు చేసి దుకాణాలను విద్యుత్ కాంతులతో అలంకరించనున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది టపాసుల దుకాణాలు వెలిశాయి. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రమీదలు విక్రయిస్తున్నారు. పండుగ నేపథ్యంలో మార్కెట్లు సందడిగా మారాయి.
మూడు రోజులపాటు పూజలు
బంగారం కొనుగోళ్లు.. ధనలక్ష్మీ దేవి పూజలు, నోములు, వ్రతాలు, విద్యుత్ కాంతులతో అలంకరించిన గృహాలు, టపాసుల మోతల సమహారమే దీపావళి పండుగ. త్రయోదశి రోజు ప్రారంభమై నరక చతుర్దశి, దీపావళి పేరుతో మూడు రోజులపాటు పండుగ జరుపుకొంటారు. ముందుగా ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేసి వేడుకలు ప్రారంభించారు. బుధవారం చతుర్దశి రోజు నరకసుర దహనం చేయగా.. నేడు ధనలక్ష్మీదేవి పూజలు చేయనున్నారు. వ్యాపార గృహ సముదాయాల్లో పూజలు చేసిన అనంతరం టపాసులు కాలుస్తారు. ‘దీపేన సాధ్యతే సర్వం’ అనే నానుడి ఉంది. దీపాలను వెలిగించి దైవాలను ఆరాధించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కావడంతో భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
రాక్షస పీడ వదిలిందని..
తిథులన్నింటిలో అసురుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది. సీ్త్రలతో అమర్యాదగా ప్రవర్తించే వారికి శిక్ష విధించి తీరాలని ఈ పండుగ సందేశం ఇస్తుంది. కృష్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్లిన సత్యబామ నరకాసురుడిని వధిస్తుంది. అప్పటినుంచి రాక్షస పీడ వదిలిందని ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారు.
– ఇందారపు మధుకర్‌శర్మ,
పురోహితులు
Comments
Please login to add a commentAdd a comment