‘సమగ్ర’ సర్వేకు సన్నద్ధం
● నవంబర్ 6 నుంచి సామాజిక, ఆర్థిక, కులగణన ● జిల్లాలో 1400 మంది ఎన్యూమరేటర్ల నియామకం ● ఇంటింటికీ తిరుగుతూ 56 అంశాలతో వివరాల సేకరణ
ఆసిఫాబాద్: సమగ్ర ఇంటింటి సర్వేకు ప్రభుత్వం సన్నద్ధమైంది. నవంబర్ 6 నుంచి సామాజిక, ఆర్థి క, కుల గణన ప్రారంభం కానుంది. సర్వే మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులంతోపాటు ఇతర అంశాల ఆధారంగా వివరాలు సేకరించనున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిష్ణాతులైన డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత నమూనాలో వివరాలు నమోదు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 29న సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఎన్యూమరేటర్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
56 అంశాలతో సర్వే
ఎన్యూమరేటర్లు గడపగడపకూ వెళ్లి 56 అంశాలతో కూడిన వివరాలు సేకరిస్తారు. యజమాని, కుటుంబ సభ్యులు, కులం, వయస్సు, మాతృభాష, ఆధార్, మొబైల్ నంబర్, మానసిక స్థితి, వైకల్యం, విద్య, చదువు మానివేస్తే ఏ తరగతి అనేది నమోదు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న పని, ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యాపారం, పారిశ్రామిక వేత్త అయితే వార్షిక టర్నోవర్.. వేతన కార్మికులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు.. సంప్రదాయ కులవృత్తుల వివరాలు సేకరిస్తారు. అనారోగ్యం, వార్షిక ఆదాయం, ఆస్తులు, బ్యాంకు అప్పుల వివరాలు కూడా ఫార్మ ట్ ప్రకారం నమోదు చేస్తారు. ఆదాయపు పన్ను చెల్లింపు దారులైతే బ్యాంకు ఖాతా, భూమి ఉంటే ధరణి పాస్‌పుస్తకం నంబర్, పట్టాభూమి, అసైన్డ్ భూమి, నీటి పారుదల సౌకర్యం, కౌలు భూమి సాగు చేస్తే ఆ వివరాలు సైతం సేకరించనున్నారు. ఒకవేళ రిజర్వేషన్‌తో విద్య, ఉద్యోగ తదితర ప్రయోజనాలు పొందితే వివరాలు, ఐదేళ్లుగా లబ్ధిపొందిన పథకాల పేర్లు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందారా.. కుటుంబ సభ్యుల రాజకీయ నేపథ్యం గురించి కూడా ఆరా తీస్తారు. కుటుంబంలోని ఎవరైన ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలస వెళ్తే వివరాలు, వలసకు కారణాలు నమోదు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన అప్పులు, పశుసంపద, స్థిరాస్తి వివరాలు, రేషన్ కార్డు నంబర్, నివాస గృహ విస్తీర్ణం, తాగునీటి వసతి, ఇంటి విస్తీర్ణం, ఇంట్లో మరుగుదొడ్ల సంఖ్య, ఇంటి గదుల సంఖ్య తదితర వివరాలు సేకరిస్తారు.
1400 మంది ఎన్యూమరేటర్లు
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1,20,420 గృహాలు ఉండగా.. జనాభా 5,15,820 ఉంది. ప్రస్తుత కులగణన సర్వే నిర్వహించేందుకు జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో 1400 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఇందులో 15 శాతం అదనపు సిబ్బంది ఉంటారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు నవంబర్ 3లోగా జాబితా సిద్ధం చేసుకుని 6 నుంచి సర్వే ప్రారంభిస్తారు. జిల్లాను 1115 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. 2011లో జనగణనలో ఉపయోగించిన మ్యాపుల సాయం తీసుకుంటారు. ప్రతీ మండలంలో గరిష్టంగా 50 మంది ఎన్యూమరేటర్లను నియమిస్తారు.
ప్రజలు సహకరించాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన కులాల అభ్యున్నతికి ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, ఇతర అంశాల ఆధారంగా వివరాలు సేకరించనున్నాం. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 335 గ్రామ పంచాయతీల్లో నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుంది. ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలి.
– వెంకటేశ్ దోత్రే, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment