వైద్యరంగంలో మరో ముందడుగు
● జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు ● పాత కలెక్టరేట్ భవనంలో తరగతుల నిర్వహణ ● ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు ● ఏటా 60 మందికి ప్రవేశం
ఆసిఫాబాద్: జిల్లాకు చెందిన విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ కోర్సు కోసం హైదరాబాద్, వరంగల్‌తో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు కొత్తగా నర్సింగ్ కళాశాల మంజూరు చేసింది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాగా తాజాగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలకు నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయగా వాటిలో కుమురంభీం జిల్లా కూడా ఉండడంతో జిల్లా వైద్యరంగంలో మరో ముందడుగు పడినట్లయింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఒక్కో కళాశాలకు రూ.26 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది తాత్కాలికంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో నర్సింగ్ కళాశాలకు భవనం కేటాయించారు. విద్యార్థులకు వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
44 మంది ప్రవేశం
కళాశాలలో ఈ ఏడాది బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరంలో 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ద్వారా ఇప్పటికే థర్డ్ ఫేస్ అడ్మిషన్లు పూర్తికాగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో 44 మంది ప్రవేశం పొందారు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. ఏటా కళాశాలలో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. యూనివర్సిటీ ఆదేశాల మేరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.
8 మంది బోధనా సిబ్బంది
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఈనెల 4న నర్సింగ్ కళాశాల లాంఛనంగా ఏర్పాటు చేశారు. ఎనిమిది మంది బోధనా సిబ్బంది అవసరముండగా ఇప్పటికే ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రి న్సిపాల్ విధుల్లో చేరారు. వీరితో పాటు బోధనేతర సిబ్బందిని సైతం నియమించాల్సి ఉంది. కళాశాల నిర్వహణకు అవసరమున్న సదుపాయాల కల్పన కు చర్యలు తీసుకుంటున్నారు. 8 స్కిల్డ్ ల్యాబ్‌లు అవసరముండగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఎమ్సెట్ ర్యాంకు ద్వారా కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి కలవారు అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది
జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన నర్సింగ్ కళాశాలలో ఏటా 60 మందికి అడ్మిషన్లు కల్పిస్తాం. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. 8 మంది బోధాన సిబ్బంది అవసరముండగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను నియమించాం. వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది.
– పద్మలత,
ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment