ప్రజాపాలన విజయోత్సవ సంబురం
● జిల్లా అభివృద్ధిని వివరించిన కలెక్టర్ ● అలరించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు
ఆసిఫాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్‌లో విజయోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలోని 54 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 72 వేల జీరో బిల్లులు, 48,356 మంది రైతులకు రూ.272 కోట్ల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో 1,45,000 దరఖాస్తులు స్వీకరించామన్నారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ కింద ద్వారా జిల్లాలో 75 వేల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. గడిచిన 11 నెలల్లో 129 స్టాఫ్‌నర్స్, 275 ఉపాధ్యాయ, 151 కానిస్టేబుల్ పోస్టులతో పాటు గ్రూప్–4 ద్వారా 78 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 6,744 మంది పేదలకు చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 80 మంది కళాకారులు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రదర్శనల ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment