అంగన్‌వాడీలకు అందని బెనిఫిట్స్
● ఉద్యోగ విరమణ ప్రయోజనాలకోసం ఎదురుచూపులు ● అమలుకు నోచని మంత్రి హామీ
ఆసిఫాబాద్‌అర్బన్: 65 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తప్పించి ఐదు నెలలు కావస్తున్నా నేటికీ వారికి రా వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ ప్ర యోజనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్‌వాడీలలో తప్పనిసరి రిటైర్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది జూలైలో జిల్లాలో 31 మంది టీచర్లు, 125 మంది ఆయాలు రిటైర్‌అయ్యారు. అరకొర వేతనాలతో ఇన్నాళ్లు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ఆసరా కూడా లేకపోవడంతో ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో..
అంగన్‌వాడీ కార్యకర్తలకు తప్పనిసరి రిటైర్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రిటైర్మెంట్ బెనిపిట్స్ కింద టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు ఇస్తామని మొదట్లో ప్రకటించింది. దీనిపై అంగన్‌వాడీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో ఇంతకాలం పనిచేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం సమీక్షించి టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ పదవీ విరమణ పొంది నెలలు గడుస్తున్నా మంత్రి హామీ ఆచరణకు నోచుకోవడంలేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివేదికలు పంపించాం
జిల్లాలో 65 సంవత్సరాలు దాటిన 31 మంది అంగన్‌వాడీ టీచర్లు, 125 మంది ఆయాల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ మంజూరైన వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, జిల్లా సంక్షేమాధికారి
Comments
Please login to add a commentAdd a comment