రియల్‌ ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఢమాల్‌

Published Tue, Dec 17 2024 12:20 AM | Last Updated on Tue, Dec 17 2024 12:19 AM

రియల్

రియల్‌ ఢమాల్‌

కుదేలైన స్థిరాస్తి వ్యాపారం

ఉమ్మడి జిల్లాలో ప్లాట్ల విక్రయాలు డౌన్‌

తగ్గిన డాక్యుమెంట్లు.. సర్కారు ఆదాయంపై ప్రభావం

‘అనధికార’ రిజిస్ట్రేషన్ల నిలుపుదలతోనే..

మార్కెట్లో ఆర్థిక ఒడిదొడుకులూ కారణం

సాక్షి,ఆదిలాబాద్‌: ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోయింది. రిజిస్ట్రేషన్లలో మందగమనం చోటు చేసుకుంది. డాక్యుమెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా ఆ ప్రభావం ఆదాయంపై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో నాన్‌ అగ్రికల్చర్‌ రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం.. అనధికార లేఅవుట్‌లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడమే. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ చర్యల కారణంగా ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయని స్థిరాస్తి వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ఆర్థిక ఒడిదొడుకులు కూడా కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్నిచ్చే వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఈ ఏడాది ఆదాయం తగ్గుముఖం పట్టింది. వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రెవెన్యూశాఖ తహసీల్దార్లు చేపడుతుండగా, నాన్‌ అగ్రికల్చర్‌ భూములను రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబా ద్‌, బోథ్‌, నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ప్లాట్ల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

తగ్గిన డాక్యుమెంట్ల సంఖ్య..

● ఆదిలాబాద్‌ జిల్లాలో 2021లో 16,112 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కాగా, 2022లో 12,280, 2023 లో 13,327, 2024లో 10,070కి పడిపోయింది.

● నిర్మల్‌లో 2020–21లో 17,788 డాక్యుమెంట్లు కాగా, 2022లో 16,009, 2023లో 18,695 కాగా, 2024లో 13,660కి తగ్గింది.

● మంచిర్యాలలో 2021లో 18,260 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా, 2022లో 23,326 డాక్యుమెంట్లు, 2023లో 26,956 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం 17,883కు తగ్గిపోయింది.

● కుమురంభీం ఆసిఫాబాద్‌లో 2021లో 2,413, 2022లో 2,810, 2023లో 2,385, 2024లో మా త్రం 1,884కు తగ్గింది. ఈ ప్రభావం ఆదాయంపై పడింది. గణనీయంగా రాబడి తగ్గింది.

కారణాలు ఇవి..

ముఖ్యంగా పట్టణాల్లో అనధికారిక లేఅవుట్లు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ఏళ్లుగా ఈ లేఅవుట్లలో ప్లాట్ల క్రయ విక్రయాలు కొనసాగుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా లభించింది. అయితే 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో 257ను తీసుకువచ్చింది. ఆ ప్రకారం డీటీసీపీ, ఎల్‌ఆర్‌ఎస్‌ లేనటువంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో నిబంధనలను అమలు చేసింది. ఆ జీవో తర్వాత పలువురు ప్లాట్ల విక్రయదారులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో ఆ తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే వచ్చాయి. 2021 వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా లభించింది. అయితే ఆ తర్వాత సంవత్సరాల్లో మాత్రం డాక్యుమెంట్ల సంఖ్యతో పాటు ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈఏడాది గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 257 అమలును కఠినతరం చేయడంతో ఈ ఏడాది మార్కెట్లో ప్లాట్ల క్రయ విక్రయాల్లో మందగమనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్‌లో రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల విక్రయాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ ఆదాయం నేరుగా ప్రభుత్వానికే చేరడంతో మార్కెట్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఇది కూడా ఆదిలాబాద్‌లో ఆదాయం తగ్గడానికి ఒక కారణంగా నిలుస్తుంది. మార్కెట్లో ఆర్థిక ఒడిదొడుకులు కూడా ప్లాట్ల విక్రయాలు గణనీయంగా తగ్గడానికి ఒక కారణంగా రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో

రిజిస్ట్రేషన్‌ శాఖకు సమకూరిన ఆదాయం వివరాలు (రూ.కోట్లలో)

ఆదిలాబాద్‌లోని ఓ వెంచర్‌

జిల్లా 2021 2022 2023 2024

ఆదిలాబాద్‌ 87.86 79.80 62.35 35.35

నిర్మల్‌ 49.04 48.92 64.22 29.74

మంచిర్యాల 44.28 76.93 72.51 59.98

కుమురంభీం 55.91 79.37 59.59 04.9

హెచ్చు తగ్గులు సహజమే..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో హెచ్చుతగ్గులు సహజమే. ఈ ఏడాది డాక్యుమెంట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపింది. మార్కెట్లో ఒడిదొడుకులు తగ్గితే డాక్యుమెంట్ల సంఖ్యతో పాటు ఆదాయం పెరుగుతుంది.

– ఎం.రవీందర్‌రావు,

డీఆర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, ఆదిలాబాద్‌

అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నో..

అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు కొంత కాలంగా జరగడం లేదు. మార్కెట్లో ప్లాట్ల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. పాత లేఅవుట్లకు డీటీసీపీ అప్రూవల్‌ లేవు. జీవో 257 అమలు కంటే ముందు ఏర్పడిన ఈ లేఅవుట్లలో గతంలో ఒకరి నుంచి మరొకరికి ప్లాట్ల విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం డీటీసీపీ అప్రూవల్‌ ఉన్న లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నారు.

– శ్రీధర్‌, డాక్యుమెంట్‌ రైటర్‌, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
రియల్‌ ఢమాల్‌1
1/2

రియల్‌ ఢమాల్‌

రియల్‌ ఢమాల్‌2
2/2

రియల్‌ ఢమాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement