ఐదుగురికే బోనస్!
● లక్ష్యానికి దూరంగా ధాన్యం కొనుగోళ్లు ● ప్రభుత్వం బోనస్ ప్రకటించినా ప్రైవేట్‌కే మొగ్గు ● తుదిదశకు చేరుకున్న వరికోతలు
దహెగాం(సిర్పూర్): సన్నరకం వరిధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా జిల్లా రైతులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష్యానికి దూరంగా కొనుగోళ్లు సాగుతున్నాయి. అన్నదాతలు ఎక్కువగా ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. జిల్లాలో అక్టోబర్‌లోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ వరికోతలు ఆలస్యంగా మొదలయ్యాయి. ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నా కేంద్రాలకు ధాన్యం ఆశించిన మేర రాకపోవడం గమనార్హం.
55 వేల ఎకరాల్లో సాగు
జిల్లా రైతులు పత్తి పంట తర్వాత వానాకాలం సీజన్‌లో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగునీటి సౌకర్యం అంతంతే ఉన్నా చెరువులు, కుంటలు, బోరుబావులు, వర్షాధారంగా పంట పండించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. అలాగే రాష్ట్రప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగు ను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తామని ప్రకటించింది. అయితే నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి. తేమశాతం 17కు మించకుండా ఉండడంతో పాటు తప్ప, తాలు లేకుండా తూర్పారా పట్టా ల్సి ఉంటుంది. వ్యాపారులు మాత్రం తేమశా తం పట్టించుకోకుండా హమాలీ చార్జీలు లేకుండానే క్వింటాలుకు రూ.2,600 నుంచి రూ. 2,700 చెల్లిస్తున్నారు. అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించా లి. రైతులకు ఇబ్బందులు లేకుండా అక్టోబర్‌లో నే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించింది. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,434 మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా మంది రైతులు ప్రైవేటుకే విక్రయించారు. మొత్తం 2,434 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఇందులో సన్నరకం ధాన్యం 2,210 మెట్రిక్ టన్నులు ఉండగా, దొడ్డురకం కేవలం 224 మెట్రిక్ టన్నులు మాత్రమే. డిమాండ్ దృష్ట్యా ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. బియ్యంగా మార్చి కొన్ని రోజులు నిల్వ చేసుకున్న తర్వాత మార్కెట్‌లో విక్రయించనున్నారు. సన్నరకం బియ్యానికి క్వింటాల్‌కు రూ.7 వేల పైనే ధర పలికే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
బోనస్ వచ్చింది
వారం రోజుల క్రితం స్థానిక కొనుగోలు కేంద్రంలో 84 క్వింటాళ్ల వరిధాన్యం అమ్ముకు న్నా. క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఖాతాల్లో జమ అయ్యింది. ఇంకా 35 క్వింటాళ్ల వరకు ధాన్యం ఉంది. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రంలోనే సోమవారం విక్రయించినం.
– సుంకరి బుచ్చమ్మ, మహిళా రైతు, దహెగాం
వ్యాపారులకే అమ్మిన
ఈ వానాకాలంలో నాకు సుమారు 68 క్వింటాళ్ల వడ్లు అయినయ్. సర్కారు వాళ్లకు అమ్ముదామంటే తేమ శాతం, తప్పతాలు తూర్పారా పట్టి అమ్మాలే. అదేమీ లేకుండా వడ్లను ఆరు రోజులు ఆరబెట్టి ప్రైవేటు వ్యాపారులకు రూ.2200 ధరతో అమ్మిన. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు అమ్మలేదు.
– వడ్గూరి విజయ్, నక్కలగూడ, మం.రెబ్బెన
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు
సహకార సంఘం కొనుగోలు కేంద్రాలు 21
ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 13
కొనుగోళ్ల లక్ష్యం 57వేల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం
2,434 మెట్రిక్ టన్నులు
సన్నాలు 2,210 మెట్రిక్ టన్నులు
దొడ్డురకం 224 మెట్రిక్ టన్నులు
బోనస్ పొందిన రైతులు ఐదుగురు
44 మందితో జాబితా.. ఐదుగురికి బోనస్
హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 44 మంది రైతుల వివరాలతో జాబితాను ప్రభుత్వానికి పంపించారు. ఇందులో కేవలం ఐదుగురికి మాత్రమే బోనస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో బోనస్ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రెండు రోజుల్లో మిగిలిన వారి ఖాతాల్లో బోనస్ జమయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయిన నాలుగైదు రోజుల్లోనే బోనస్ డబ్బులు డబ్బులు కూడా పడతాయని వివరించారు. దహెగాం మండలంలో ఇద్దరు, చింతలమానెపల్లి మండలంలో ముగ్గురు రైతులు బోనస్ పొందారు. అయితే ప్రభుత్వానికి విక్రయిస్తే క్వింటాలుకు బోనస్‌తో కలిపి రూ.2,800 వస్తుండగా, అదే వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాలుకు రూ.2600 నుంచి రూ.2700 పొందుతున్నారు. క్వింటాలుకు రూ.100 నుంచి రూ.200 వరకు నష్టపోతున్నా ప్రైవేటులో నిబంధనలు లేకపోవడంతో వారికే విక్రయిస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయితే గత వారం కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి కేంద్రాలకు తీసుకురావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment