అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
ఆసిఫాబాద్: జిల్లా అభివృద్ధికి రూ.125 కోట్ల నిధులు కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని జగన్నాథ్‌పూర్, కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల ద్వారా సుమారు 80 వేల ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా, అసంపూర్తి పనులతో ఆయకట్టుకు సాగు నీరందడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వచ్చే ఏడాది సాగునీరందేలా ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.75 కోట్లు కేటాయించాలని విన్నవించారు. అలాగే ఏజెన్సీలో పట్టాల సమస్య పరిష్కరించాలని కోరారు. ఇటీవల జైనూర్ ఘటన నేపథ్యంలో త్వరలో ఆదివాసీలతో ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment