● జిల్లావ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సంబురాలు ● ఘనంగా భో
ఆసిఫాబాద్‌అర్బన్: ఇళ్ల ముందు తీరొక్క రంగులతో ముగ్గులు, ఆవుపేడతో గొబ్బెమ్మలు, గరికె, పూలు, రేగు పళ్లతో అలంకరణలు.. వీధుల్లో పతంగులతో చిన్నారుల కోలాహలం.. ప్రతీ ఇంట్లో సకినాల ఘుమఘుమలతో పల్లె లోగిళ్లలో సంక్రాంతి సందడి నెలకొంది. ఉద్యోగం, ఉపాధి, విద్య తదితర కారణాలతో దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. మంగళవారం మకర సంక్రాంతి, బుధవారం కనుమ పండుగ జరుపుకోనున్నారు. వివిధ ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు, కబడ్డీ, క్రికెట్ వంటి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. యువత పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. వారం ముందునుంచే ఇళ్లలో సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, ఇతర పిండివంటలు తయారీ ప్రారంభించారు. పాఠశాలలకు సెలవులు రావడంతో చిన్నారులు పతంగులు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. గంగిరెద్దులు సందడి చేస్తున్నాయి. మరోవైపు జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో రంగుల దుకాణాలు, పతంగుల దుకాణాలు ప్రత్యేకంగా వెలిశాయి.
వారం రోజులు ఇక్కడే..
కుటుంబంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. సంక్రాంతి పండుగకు వారం రోజులు ఆసిఫాబాద్‌లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అమ్మ ఇంట్లో సమయమే తెలియదు. కుటుంబంతో ఆనందంగా గడిపితే ఒత్తిడి లేకుండా పోతుంది.
– తాటిపల్లి రవళి, ఆసిఫాబాద్
●
సంప్రదాయాలు కాపాడుకుందాం
సంప్రదాయాలు కాపాడుకుంటూ ప్రతీ పండుగను ఘనంగా జరుపుకోవాలి. సంక్రాంతి పండుగకు చిన్నారులకు బొడబొడ పోకలు పోస్తుంటాం. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కుటుంబంతో కలిసి కరీంనగర్‌లో ఉంటున్నా ఏ పండుగైనా ఆసిఫాబాద్‌కు వస్తుంటాం.
– చిట్టిమల్ల నిఖిల, ఆసిఫాబాద్
పండుగకు సొంతూరికి..
ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటాం. ఏటా సంక్రాంతి పండుగకు సొంతూరు ఆసిఫాబాద్‌కు వస్తుంటాం. పండుగ అమ్మగారి ఇంట్లో జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, బంధువులను కలవడం.. అమ్మ చేసిన సకినాలు తినడం గొప్ప అనుభూతి.
– దానపల్లి శారద, ఆసిఫాబాద్
వ్యాపారం పుంజుకుంది
సంక్రాంతి పండుగ నేపథ్యంలో మార్కెట్‌లో వ్యాపారం పుంజుకుంది. ఎక్కువ మంది నోములు నోచుకుంటున్నారు. ఆయా వస్తువుల కోసం మా వద్దకు వస్తున్నారు. వారం రోజుల నుంచి మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నాం.
– తూమోజు ఉమ,
లేడీస్ ఎంపోరియం ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment