భీం పోరాట స్ఫూర్తితో అభివృద్ధి
● జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ ● జోడేఘాట్‌లో కుమురం భీంకు నివాళులు ● జంగుబాయి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆసిఫాబాద్: విల్లంబుల వీరుడు కుమురంభీం పోరాట స్ఫూర్తితో అభివృద్ధి పనులు చేపడతామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జుపటేల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ముందుగా రెబ్బెన మండలం గంగాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద స్వాగత తోరణం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో రూ.1.35 కోట్లతో బాలసదన్ భవనానికి భూమి పూజ చేశారు. జన్కాపూర్‌లో రూ.19 లక్షలతో ని ర్మించిన ఆదర్శ అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. వాంకిడి మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. వాహనదారులకు అవగాహన కల్పించారు. కలెక్టర్, ఎస్పీ హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
టూరిజం స్పాట్‌గా జోడేఘాట్
కెరమెరి(ఆసిఫాబాద్): జోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి సోమవారం కెరమెరి మండలం జోడేఘాట్‌ను సందర్శించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాధి వద్ద పూజలు చేశారు. రూ.4.96 లక్షలతో పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, జల్, జంగల్, జమీన్ కోసం కుమురంభీం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. చరిత్రను తిరగరాసిన జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భీం వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ట్రైబర్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ దివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకోవాల్సి న అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం
కెరమెరి(ఆసిఫాబాద్): దీపం రూపంలో ఉన్న జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్‌తివారితో కలిసి సందర్శించారు. సంప్రదాయ పద్ధతిలో గుహలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీలు ప్రకృతి రూపంలో దేవుళ్లను ఆరాధిస్తారన్నారు. అడవుల్లో జీవిస్తున్నా గిరిజనులది ప్రత్యేక జీవన విధానమన్నారు. రూ.50 లక్షలతో ఆలయ క్షేత్రంలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ భూములకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని అన్నారు. జంగుబాయి అమ్మవారిని మొదటిసారి దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రకృతిని పూజించడం ఈ ప్రాంతం నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు. రోడ్లు అభివృద్ధికి అటవీ శాఖ అధికారులతో చర్చించి నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏఎస్పీ చిత్తరంజన్, నాయకులు ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, భీం మనుమడు కుమురం సోనేరావు, పీఏసీఎస్ చైర్మెన్ కార్నాథం సంజీవ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ వేముర్ల సంతోష్, ఆలయ ఈవో బాపిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తుపల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
గంగాపూర్ బాలాజీ వెంకన్న ఆలయ ముఖద్వారానికి భూమిపూజ
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ నూతన ముఖద్వారం నిర్మాణానికి సోమవారం రాష్ట్ర మంత్రి సీతక్క భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మండల కేంద్రంలో గతంలో నిర్మించిన ఆలయ ముఖద్వారం జాతీయ రహదారి విస్తరణలో తొలగించాల్సి వస్తోంది. భక్తులు, ఆలయ కమిటీ నిర్ణయం మేరకు గంగాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో రూ.10 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో నూతన ముఖద్వార నిర్మాణానికి పంచాయతీరాజ్ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఈ పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తారని ఆశించిన భక్తులకు నిరాశే ఎదురైంది. వచ్చే నెలలో ఆలయంలో నిర్వహించే జాతరకు వస్తానని చెప్పి మంత్రి కార్యక్రమాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment