పథకాల పండుగ
● సంక్రాంతి తర్వాత మూడు అమలు ● ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ● కొత్త రేషన్‌కార్డుల జారీకి కార్యాచరణ సిద్ధం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ ప్రారంభం కానుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజాపాలన దరఖాస్తులు, కుటుంబ సర్వేలో ప్రజలు పేర్కొన్న వివరాల ఆధారంగా ఇంటింటి సర్వే పూర్తయింది. అర్హులను గుర్తించేందుకు ఉమ్మడి జిల్లాలో అధికారులు ప్రతీ గడపకు వెళ్లి వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేశారు. అక్కడక్కడ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ తర్వాత ఉమ్మడి జిల్లాలో సంక్షేమ పథకాల పండుగ మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు అంతా సక్రమంగా సాగేలా దిశానిర్దేశం చేసింది. పథకాల ఎంపికకు కీలకంగా మారిన గ్రామసభల్లో ఈ నెల 24లోపు అర్హులను గుర్తించాల్సి ఉంది. పండుగ తర్వాత అధికార యంత్రాంగం పథకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. మరోవైపు ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన చేస్తానని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.
తగ్గనున్న రైతు భరోసా
ఈ నెల 16నుంచి రైతుభరోసా కోసం సాగు సర్వే మొదలు కానుంది. నాలుగు రోజుల్లో అంటే 20వరకు సర్వే పూర్తి చేసి సాగు భూముల లెక్క తేల్చాలి ఉంది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు చేపట్టే ఈ సర్వేలో పట్టాభూములుగా ఉండి, సాగులో ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.12వేల చొప్పున అందనుంది. ఉమ్మడి జిల్లాలో చాలా భూములు రియల్ వెంచర్లుగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల రోడ్లు, వ్యాపార కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంకా రెవెన్యూ రికార్డుల్లో సాగు భూములుగానే కొనసాగుతున్నాయి. వీటిపైన సమగ్రంగా సర్వేచేసి లబ్ధిదారులను తేల్చనున్నారు. గతంలో గుట్టలు, అటవీ భూములు, రోడ్లు, వెంచర్లు, వాగులు, వంకల్లో ఉన్న భూములు, పట్టణ శివార్లలో ఇళ్ల స్థలాలకు సైతం పెట్టుబడి సాయం అందింది. తాజా సర్వేతో గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు కంటే భరోసా లబ్ధిదారులు తగ్గే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట కలుగనుంది. పాత విధానంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లయిన వారు, చిన్న పిల్లల పేర్ల మార్పులు, చేర్పులు, కుటుంబాల నుంచి వేర్వేరుగా ఉన్న వారికి రేషన్ కార్డుల అవసరం ఏర్పడుతోంది. ప్రస్తుతం పథకాలు రేషన్‌కార్డుల ఆధారంగానే ఎంపిక చేస్తున్న తరుణంలో కార్డుల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇక భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12వేల సాయం అందనుంది. ఇందుకు ఉపాధిహామీ పథకంలో కనీసం 20రోజులు పని దినాలు చేసినట్లు నమోదై ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
తర్వాత ‘స్థానిక’ం
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కీలకమైన ఈ మూడు సంక్షేమ పథకాల అమలు మొదలైన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, వార్డులు, ఓటర్ల మార్పులు, చేర్పులతో తుది జాబితా వెలువడింది. నాయకులు సైతం ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పథకాల అమలు జరిగాక పంచాయతీ, మండల, జెడ్పీ, ఆ తర్వాత పట్టణ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు
గూడు లేని నిరుపేదలకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి కాగా, అర్హులను ప్రకటించాల్సి ఉంది. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిధిలో గిరిజన ప్రాంతాలతో సహా గ్రామ, పట్టణాల్లో నిర్వహించే సభల్లోనే అర్హులను ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment