కృష్ణా కలెక్టరేట్‌లో
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, తుపాను రానున్నట్లు వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బుధవారం తెలిపారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కంట్రోల్‌రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా మూడు షిఫ్ట్‌లుగా నియమించామన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 08672–252572ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అకాలవర్షాలు, తుపాను ప్రభావంతో ఏదైనా నష్టం జరిగినా ఆ ప్రాంతవాసులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలిపిన వెంటనే సహాయకచర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు.
కంకిపాడు(పెనమలూరు): వాతావరణం స్వల్పంగా తెరపిచ్చింది. అయినా అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో గత ఐదు రోజులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంట పొలాల్లో ఉన్న పంటను సంరక్షించుకునే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో వర్షాల కారణంగా పంట పొలాల్లో రాశులుగా పోసి ఉంచిన మొక్కజొన్న, జొన్న, ధాన్యం, పసుపు, అరటి, మిర్చి పంటలను పొడి ప్రదేశాలకు చేర్చి ఆరబెట్టారు. హుటాహుటిన ధాన్యం కాటాలు వేసి లారీల్లో మిల్లులకు తరలిస్తున్నారు. ఆరబెట్టిన పసుపు, మొక్కజొన్న, జొన్న పంటలను కూలీలతో మెరక ప్రాంతాలకు చేర్చారు. పసుపు పంట నాలుగు రోజులు పాటు నీటిలో నానటంతో కొమ్ములు నలుపు రంగుకుమారాయి. కోతకు సిద్ధంగా ఉన్న జొన్న, మొక్కజొన్న పైర్లు ఫంగస్ బారిన పడ్డాయి. గింజలు నల్లబడటంతో మార్కెట్‌కు చేర్చే అవకాశం కూడా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట మీద ఉన్న మొక్కజొన్న, జొన్న చేలల్లో మురుగునీటిని తొలగించేందుకు ఆయిల్ ఇంజిన్లు వినియోగిస్తున్నారు. పంట బోదెల్లోకి నీటిని తోడే పనులను రైతులు చేపడుతున్నారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రాథమికంగా పంట నష్టం వివరాలను సమర్థంగా నమోదు చేయాలని ఆయా శాఖలకు సూచనలు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం. విజయభారతి కంకిపాడు, తోట్లవల్లూరు ప్రాంతాల్లో పర్యటించి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. పంట సంరక్షణ చర్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.
నష్టం అంచనాలు ఇలా..
అకాల వర్షానికి ఉమ్మడి జిల్లాలో పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రాథమిక అంచనాలను సిద్ధం చేయాలని మౌఖికంగా సూచించారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లాలోని తోట్లవల్లూరు, కంకిపాడు, గన్నవరం, పమిడిముక్కల, మోపిదేవి, పెనమలూరు, అవనిగడ్డ ప్రాంతాల్లోని సుమారు 44 గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, ధాన్యం, ఉద్యానశాఖ పంటలకు సంబంధించి అరటి, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 897.72 హెక్టార్లలోనూ, జొన్న 78.5 హెక్టార్లలోనూ, వరి 152.27 హెక్టార్లలోనూ నష్టం వాటిల్లినట్లు అంచనాలను రూపొందించారు. కల్లాల్లో ఆరబోసిన స్థితిలో మొక్కజొన్న 647 హెక్టార్లలో, జొన్న 209 హెక్టార్లలో, వరి 96.23 హెక్టార్లలోనూ ఉంది. కల్లాల్లో ఉన్న పంటను మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు రైతులు త్వరపడుతున్నారు.
కొనసాగుతున్న ద్రోణి ప్రభావం ఐదో రోజు కొనసాగిన వర్షాలు కల్లాల్లోనే పలు పంటలు పంట నష్టం అంచనాల్లో అధికారులు
నేటి నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు..
పామర్రు నియోజకవర్గంలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ పరిశీలించారు. తోట్లవల్లూరు మండలంలోని లంక ప్రాంతాలను సైతం పరిశీలించి, రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆ వివరాలను వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే నేటి నుంచే రైతు భరోసా కేంద్రాల ద్వారా మొక్క జొన్న కొనుగోళ్లు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment