వ్యాపార సంస్థగా సీసీఐ
కంచికచర్ల: సీసీఐ విధించిన నిబంధనలు పత్తి రైతులకు మేలు చేయకపోగా ప్రతి బంధకాలుగా తయారయ్యాయి. తేమ శాతం పేరుతో మద్దతు ధరలో కోత విధించడం, తూకం తగ్గించడం వంటి చర్య లతో తెల్లబంగారం సాగుచేస్తున్న రైతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. రైతులను ఆదుకోవాల్సిన సీసీఐ వ్యాపార సంస్థగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
77,785 ఎకరాల్లో పత్తి సాగు
ఎన్టీఆర్ జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్‌లో 77,785 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. ఇప్పటికే పత్తితీతలు ప్రారంభమయ్యాయి. ప్రతికూల వాతావ రణం వల్ల ఈ ఏడాది పత్తి దిగుబడులు ఆశాజన కంగా లేవు. మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేదు. గతంలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సీజన్‌లో వర్షాలు కురవడంతో ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. వ్యాపారులు క్వింటాకు రూ.5,500 నుంచి రూ.6 వేల లోపే ధర ఇస్తున్నారు. పత్తి తీసేందుకు కూలీల ఖర్చు ఎక్కువైందని, క్వింటాకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు కూలి చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చవుతోందని వివరిస్తున్నారు.
ఆరు ప్రాంతాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు
ఎన్టీఆర్ జిల్లాలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, గంపలగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆయా ప్రాంతాల రైతులు సమీప సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసు కొచ్చి విక్రయించాలని అధికారులు పేర్కొన్నారు. మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకునేందుకు ఈ నెల మొదటి వారంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని సీసీఐ అధికారులు తెలిపారు.
నాణ్యతే ముఖ్యం
సీసీఐ నిబంధనల వల్ల పత్తి రైతులకు మేలు జరగకపోవటంతో పాటు నష్టం జరిగే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం సీసీఐ, సీఎం యాప్ ద్వారా పత్తి కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు ఆధార్‌కార్డు, పట్టాదార్ పాసుపుస్తకం నకళ్లను రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలి. యాప్‌లో నమోదు చేయించుకున్న రైతుల వద్ద మాత్రమే సీసీఐ పత్తి కొంటుంది. నాణ్యత లేని, రంగు మారిన, వర్షానికి తడిచిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. నాణ్యమైన పత్తిని మాత్రమే కొంటుంది.
రైతులను ఆదుకోవాల్సిన సీసీఐ ఒక వ్యాపార సంస్థగా మారింది. లాభ నష్టాలను బేరీజు వేసుకుని సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించనప్పుడు మద్దతు ధరకు కొనాల్సిన సీసీఐ సవాలక్ష ఆంక్షలతో పత్తి రైతులను దూరం పెడుతోంది. ఇప్పటికై నా సీసీఐ విధానాన్ని మార్చుకోవాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుని అండగా నిలవాలి.
– మందా శ్రీనివాసరావు,
రైతు, కొత్తపేట, కంచికచర్ల మండలం
రైతుల నుంచి పత్తిని కొనుగోలుకు సీసీఐ నిబంధనలు విధించటం సరికాదు. నాణ్యతతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి. నాణ్యత లేదంటూ తేమ శాతం ఎక్కువ అంటూ సీసీఐ కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించాలి. లేదా పూర్తిగా ఎత్తివేయాలి.
– గుదే సాంబశివరావు,
రైతు, గొట్టుముక్కల, కంచికచర్ల మండలం
తేమ శాతం 8 లోపే ఉండాలి
2024–25 సంవత్సరానికి సంబంధించి క్వింటా పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,521. నిబంధనలకు అనుగుణంగా ఉన్న పత్తిని మాత్రమే సీసీఐ ఈ ధరకు కొంటుంది. ముఖ్యంగా పింజ పొడవు 29.50 నుంచి 30.50 మిల్లీ మీటర్ల పొడవు ఉండాలి. 29.50 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవు ఉంటే మద్దతు ధర తగ్గుతుంది. తేమ ఎనిమిది నుంచి 12 శాతం లోపే ఉండాలి. అలా ఉంటేనే మద్దతు ధర దక్కుతుంది. ఎనిమిది శాతం మించి 12 శాతం వరకు ఒక్కొక్క శాతానికి మద్దుతు ధరలో ఒక శాతం (రూ.75.21) వంతున కోత విధిస్తుంది. తొమ్మిది శాతానికి రూ.7,445.79, పది శాతానికి రూ.7,370.58, 11 శాతానికి రూ.7,235.35, 12 శాతానికి 7,220.16 చొప్పున మాత్రమే ధర దక్కుతుంది.
నిబంధనలు సరికాదు
పత్తి కొనుగోళ్లకు నిబంధనలతో ప్రతిబంధకం
సీసీఐ వ్యాపార సంస్థగా
మారిందని రైతుల ఆగ్రహం
త్వరలో పత్తి కొనుగోలు
కేంద్రాలు ప్రారంభం
నిబంధనలు సడలిస్తేనే
మేలంటున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment