21న సాగునీటి సంఘాల సమరం
సాక్షి, మచిలీపట్నం: సాగునీటి సంఘాలకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో వేగం పెంచారు. కృష్ణా జిల్లాలో ఒక ప్రాజెక్టు కమిటీతో పాటు 26 డీసీలు, 204 నీటి సంఘాలకు ఎన్నిక నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా సాగునీటి ప్రాజెక్టులు, కాలువల కింద నీటిని వినియోగించుకునే రైతులు ఓటర్లుగా ఉంటూ.. కమిటీని ఎన్నుకోనున్నారు. కృష్ణా జిల్లాలో ఈ నెల 21వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ డి.కె.బాలాజీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అధికార పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టే దిశగా అడుగులు వేస్తున్న కూటమి సర్కారు, ఎలాగైనా జిల్లాలోని అన్ని సంఘాలను కై వసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నేటి నుంచి ఓటర్ల నమోదు
సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం నుంచి ఓటర్ల జాబితా తయారు చేయనున్నారు. భూ యాజమానుల పేర్లు, వివరాలు సేకరించి, జాబితా సిద్ధం చేస్తారు. 10వ తేదీ వరకు సేకరించిన వివరాలపై అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటన, అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారు. సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, మేజర్ ప్రాజెక్టు కమిటీ ఎన్నికల పోలింగ్ వేరువేరు తేదీల్లో చేపడుతారు. ఎన్నికై న కమిటీలు కాలువల నిర్వహణ, నీటి వినియోగం, తూడు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులు చేపడుతాయి.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
ఈ నెల 6 నుంచి 10 వరకు భూ యాజమానుల ఓటరు జాబితా తయారీ.
11 నుంచి 12వ తేదీ వరకు భూ యాజమానుల ఓటరు జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ.
13వ తేదీన ఓటరు జాబితా అభ్యంతరాల పరిష్కారం.
13న తుది ఓటరు జాబితా ప్రకటన.
21 నుంచి 23 వరకు ప్రాదేశిక నియోజకవర్గాలు, నీటి యాజమాన్య సంఘాలకు ఎన్నికల నిర్వహణ.
24 నుంచి 26 వరకు డిస్ట్రిబ్యూటరీ కమిటీ పోలింగ్
27 నుంచి 29 వరకు ప్రాజెక్టు కమిటీల పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment