వైద్య సీట్లకు గ్రహణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి గత ఐదేళ్లు (2019–24) ఒక స్వర్ణయుగం లాంటిది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా, వైద్య కళాశాలల అభివృద్ధికి పెద్దపీట వేశారు. వైద్యులకు పదోన్నతులు కల్పించడం, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టే విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. కానీ నేటి ప్రభుత్వం వైద్య రంగంపై చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వైద్య వర్గాలు వాపోతున్నాయి. వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లకు ముప్పు ఏర్పడింది. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా పలు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు మంజూరైన సమయంలో విడుదలైన నిధులతో చేపట్టిన పనులను సైతం ప్రభుత్వం నిలిపివేయడంతో, రానున్న రోజుల్లో ఆ సీట్లకు ముప్పు రావచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెడికల్ గ్రాడ్యుయేషన్, పీజీ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిర్మిస్తున్న భవనాలపై వివక్ష చూపడం సరికాదంటున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్య కళాశాలలో నిలిచిన భవన నిర్మాణ పనులను కొనసాగించాలని కోరుతున్నారు.
గత ఏడాది పీజీ సీట్లు మంజూరు
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు గత ఏడాది వంద వరకూ అదనంగా పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు మంజూరయ్యాయి. వాటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరోసర్జరీతో పాటు జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లకు అనుగుణంగా నిధులు కూడా మంజూరయ్యాయి. ఆ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు నిర్మాణాలు చేపడుతున్నారు.
సౌకర్యాల కల్పన కోసమే...
పాథాలజీ విభాగం విస్తరణ, లెక్చర్ హాల్స్, డిజిటల్ లైబ్రరీ, అదనపు తరగతి గదుల ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టారు. పెరిగిన వైద్య విద్యార్థులకు అనుగుణంగా సౌకర్యాల కల్పన కోసం ఈ భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలు నిలిచి పోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సభ్యులు తనిఖీ చేస్తే పరిస్థితి ఏమిటని వైద్య వర్గాలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తామని ముందస్తుగా అఫిడవిట్ ఇస్తేనే సీట్లు మంజూరు చేస్తారని, ఇప్పుడు మధ్యలో నిర్మాణాలు నిలిచి పోవడంతో సీట్ల విషయం అగమ్యగోచరంగా మారిందంటున్నారు. ప్రభుత్వ వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడొద్దని హెచ్చరిస్తున్నారు.
నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు పీజీ సీట్ల మంజూరు సమయంలో నిధులు విడుదల ఆ నిధులతో చేపట్టిన పనులు నిలిచిన వైనం వైద్య రంగంపై ఇంత వివక్షా అంటున్న వైద్య వర్గాలు
నిర్మాణాలు పూర్తి చేయాలి
వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేయాలి. వైద్య విద్యార్థుల సదుపాయాల కోసం వైద్య కళాశాలల్లో చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తి చేయాలి. వైద్య విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు లేకుంటే సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైద్య విభాగం, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment