ఉద్యాన రైతు విలవిల
కొండంత నష్టం...గోరంత సాయం
సాక్షి, మచిలీపట్నం: ఉద్యాన రైతులు విలవిల్లాడుతున్నారు. రెండు నెలల క్రితం కురిసిన అధిక వర్షాలు, భారీ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందక అవస్థలు పడుతున్నారు. కృష్ణా నదితో పాటు బుడమేరుకు గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా జిల్లా రైతులు భారీగా నష్టపోయారు. వీరిని ఆదుకుంటామని హడావుడి చేసిన ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హుల జాబితాలో కోతలు విధించింది. అధికారులు సర్వే చేసి పంపిన నివేదికలను బేఖాతరు చేసింది. జరిగిన నష్టంలో పది శాతం మాత్రమే పరిహారం ప్రకటించింది. కొండంత నష్టం జరిగితే గోరంత సాయం విదిల్చింది. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో జిల్లా ఉద్యాన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జరిగిన నష్టం రూ.107.82కోట్లు
ఆగస్టు చివరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన వర్షాలతో వరద ఉగ్ర రూపంలో వచ్చింది. దీంతో జిల్లాలోని పంట పొలాలు బాగా దెబ్బతిన్నాయి. ఇందులో 44,521 హెక్టార్ల వ్యవసాయ, 4,070 హెక్టార్ల ఉద్యాన, 50 ఎకరాల పట్టు పంటలపై ప్రభావం చూపింది. దీంతో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల తదితర శాఖల అధికారులు సర్వేలు నిర్వహించి పంట నష్టంపై అంచనా వేశారు. ఇందులో 18 మండలాల్లోని 81 గ్రామాల్లో సాగు చేసిన ఉద్యాన పంటలు 4,070 హెక్టార్లలో దెబ్బతినడంతో రూ.107.82 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనాలు తయారు చేశారు. ఈ నివేదికలనే కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
పరిహారం 10 శాతానికి కుదింపు
వరదల్లో నష్టపోయిన ఉద్యాన పంట రైతులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించడంతో అర్హుల జాబితాలో భారీగా కోత పడింది. రూ.107.82 కోట్లు నష్టం జరిగితే కేవలం రూ.11.12 కోట్లు మాత్రమే నష్టం జరిగిందని తేల్చింది. తీరా చివరకు రూ.10.42 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ప్రభుత్వ తుది జాబితా ప్రకారం మొదటి విడతలో 3,139.272 హెక్టార్లు దెబ్బతినగా 9,616 మంది రైతులు రూ.10.80 కోట్లు మాత్రమే నష్టపోయారని, రెండో విడతలో 8 మంది రైతులు ఎనిమిదిన్నర హెక్టార్లకు రూ.2.32లక్షలు, మూడో విడతలో 151 మంది రైతులు 83.754 హెక్టార్లకు రూ.29.66 లక్షలు దెబ్బతిన్నట్లు తేల్చారు. అయితే మొదటి విడతలో దెబ్బతిన్న పంటలకు రూ.10.80 కోట్ల నష్టం గురైనట్లు చూపగా రూ.10.42 కోట్లు ఆ రైతుల ఖాతాలోకి జమ చేశారు. మిగిలిన రైతుల విషయంలో పరిహారం కోరుతూ అధికారులు నివేదిలు పంపినా వాటిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.
81 గ్రామాల్లో 4,070 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు రూ.107 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక పరిహారం కేటాయింపులో భారీగా కోత పెట్టిన ప్రభుత్వం 3,231 హెక్టార్లకు రూ.11.12 కోట్లకు కుదింపు చివరకు రూ.10.42 కోట్లు మాత్రమే మంజూరు
Comments
Please login to add a commentAdd a comment