అంబులెన్సు సిబ్బంది ఆకలి కేకలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునే అపర సంజీవని 108 వాహనాలకు కూటమి ప్రభుత్వం బ్రేకులు వేస్తోంది. రోడ్డు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఆపద సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, మెరుగైన వైద్యంకోసం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్‌లపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఫోన్ కొట్టగానే కుయ్...కుయ్ మంటూ ప్రమాద స్థలానికి 30 నిమిషాలలోపే చేరుకునే వాహనాలు ఇప్పుడు తడబడుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 24, కృష్ణాజిల్లాలో 27 మొత్తం 51 వాహనాలు ఉన్నాయి. నిర్వహణ సంస్థకు ప్రభుత్వం మూడు నెలలుగా బకాయిలు చెల్లించకపోవటంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వాహనాల మెయింటినెన్స్ సరిగా జరగటం లేదు. ఏవైనా రిపేర్లు వస్తే, వాహనాలను షెడ్డుల్లో మూలన పెడుతున్నారు. రిపేర్లు చేయించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 8కి పైగా వాహనాలు రిపేరులో ఉన్నాయి. డ్రైవర్లు, పైలెట్‌లకు మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లో సిలిండర్‌లలో ఆక్సిజన్ అయిపోయినా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. వాహనాలు నడిచేందుకు డీజిల్ సమస్యగా ఉంది. నిర్వహణ సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే గాని తిరిగి 108 వాహనాలు కుయ్..కుయ్ మని రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు.
రూ.48 కోట్ల బకాయిలు
ప్రాణాపాయ సమయాల్లో ఉపయోగపడే 108, 102,104 వాహనాల సేవలు ఎనలేనివి. ఈ మూడు అంబులెన్సుల సిబ్బందికి నెలకు రూ.16 కోట్ల చొప్పున రూ.48 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 104కు 292 అంబులెన్సులను 956 అంబులెన్సుల స్థాయికి పెంచారు. వెయ్యికి పైగా 108 అంబులెన్సులను పెంచారు. 102కు సంబంధించి 750 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. 108కు 3,500 మంది, 102కు 760 మంది, 104కు 2వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఒక్క 104 ద్వారానే ఒక్కో అంబులెన్స్‌లో ఒక్కో రోజుకు 200 మంది రోగులకు చొప్పున రోజుకు 1.91 లక్షల మందికి వైద్య సేవలను అందిస్తున్నారు. వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన ఈ పథకాల్ని తుంగలో తొక్కే యత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం వీటిపై ఉదాశీన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ వాహనాల కాంట్రాక్ట్ 2027 జూన్ వరకు ఉంటే కూటమి ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
నాడు మూడు నెలల వేతనాలు ముందే డిపాజిట్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ అత్యవసర సేవలకు మూడు నెలల వేతనాలను ముందుగానే డిపాజిట్ చేసి ప్రజావసరాలపై తమ ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అంబులెన్స్‌లకు మరమ్మతులు చేయించకుండా షెడ్డులో పెట్టి వేతనాలు బకాయి పెడుతుంటే ఈ ప్రభుత్వంలో తాము పని చేయలేమని సిబ్బంది పోరుబాట పడుతున్నారు.
నిరసనల షెడ్యూల్ ఇలా...
అంబులెన్సుల సిబ్బంది ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పోరుబాట పట్టారు. అందులో భాగంగా మంగళవారం ఆయా మండలాల్లో వైద్యులకు వినతులు అందజేశారు. బుధవారం డీఎమ్ అండ్ హెచ్‌ఓ, ఎఫ్‌డీపీ నోడల్ ఆఫీసర్లకు వినతులు అందజేశారు. ఈనెల 8న ఎంపీడీఓ, తహసీల్దార్లకు, 10న జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు వినతులను ఇస్తారు. 11న కలెక్టర్ల గ్రీవెన్స్‌లో వినతులను అందిస్తారు. ఆయా మండలాల్లోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతుల్ని సమర్పిస్తారు. ఈనెల 14న డ్రైవర్లు, డీఈఓలు తమ యాప్‌లలో సైతం పనులు నిలిపివేస్తారు.
మాకు న్యాయం చేయాలి
ఈ ప్రభుత్వం రాగానే అంబులెన్సు సిబ్బందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. మా డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.
– సందీప్,
104 ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment