దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.2.83 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 15 రోజులకు గాను హుండీల ద్వారా రూ. 2,83,53,460 నగదుతో పాటు 431 గ్రాముల బంగారం, 6.450 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక విదేశాలకు చెందిన భక్తులు అమ్మవారికి భారీగానే కానుకలను సమర్పించారు. యూఎస్‌ఏకు చెందిన 324 డాలర్లు, యుఏఈకి చెందిన 25 దిర్హమ్స్, ఇండోనేషియాకు చెందిన 3 వేలు, యూరప్ యూరోలు 10, ఒమన్‌కు చెందిన 1 రియాల్, 400 బైంసాలు, కెనడా డాలర్లు 200, ఇంగ్లాండ్ డాలర్లు 25 , ఆస్ట్రేలియా డాలర్లు 25, కతార్ రియాల్ 144 లభించాయి. ఇక ఆన్‌లైన్ ద్వారా రూ.89,633 కానుకలు దేవస్థానానికి అందాయని పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ డెప్యూటీ ఈవో రత్నరాజు, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ అకౌంట్స్ విభాగం సిబ్బంది, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొనగా, పోలీసు, సెక్యూరిటీ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు.
సురక్షిత ప్రసవాలపై
దృష్టి పెట్టండి
జి.కొండూరు: గర్భిణులకు సురక్షిత ప్రసవం అయ్యేలా వైద్య ఆరోగ్య సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె బుధవారం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలను సమీక్షించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వాహణ తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ల్యాబ్ నిర్వహణ, సురక్షిత కాన్పుల క్యాలెండర్ నిర్వహణ, లేబర్‌రూమ్‌ను తనిఖీ చేశారు. వైద్య సేవలు మెరుగుపర్చేందుకు తగు సూచనలు చేశారు. కొండపల్లి పీహెచ్‌సీ, జి.కొండూరు పీహెచ్‌సీలను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సేవల తీరును పరిశీలించారు. స్థానిక వైద్యాధికారులతో ఆమె సమీక్ష జరిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత, డాక్టర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఆహ్లాదభరిత వాతావరణంలో నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.ఎ.అజీజ్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, లాన్ టెన్నిస్, హాకీ క్రీడాంశాల్లో బుధవారం పోటీలను నిర్వహించామని, ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 654 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. అనంతరం జాతీయ పోటీలకు రాష్ట్ర జట్లను ఎంపిక చేశామన్నారు.
ఆదిదంపతులకు దీపోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం దీపోత్సవ సేవ జరిగింది. ఆలయ అర్చకులు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన నిర్వహించారు. సాయంత్రం దీపార్చనలో ఆలయ డీఈవో రత్నరాజు, పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. తొలుత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు పల్లకీపై అధిష్టించగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment