ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు జాస్తి
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు సమస్యల నిలయంగా మారాయి. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ చేరిన పేద విద్యార్థులు శిథిల భవనాలు, చాలీచాలని గదుల మధ్య నివసిస్తున్నారు. అధ్వాన మరుగుదొడ్లు, అపరిశుభ్ర వాతావరణం, గదులు, కిటికీలకు డోర్లు లేక దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన ఆహారం కరువైపోవడంతో పాటు కొన్నిచోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినీ విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 83 సంక్షేమ హాస్టళ్లు ఉండగా 4,656 మంది వసతి పొందుతున్నారు. ఇందులో 40 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 2485 మంది, బీసీ సంక్షేమ హాస్టళ్లలో 2171 మంది ఉన్నారు. మొత్తం హాస్టళ్లలో అబ్బాయిలు 2,262 మంది, బాలికలు 2,394 మంది ఉన్నారు.
సమస్యల నిలయాలు..
సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయి. గుడివాడ మండలం మోటూరు బాలికల హాస్టల్‌లో చిన్నారులు భోజనం బాగుండటం లేదని, పురుగులు వస్తున్నాయని, ఈ విషయం చెబితే, గుంజీలు తీయించడంతో పాటు కొడుతున్నారని ఇటీవలే వీడియోలో చెప్పుకున్న ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌తో పాటు పలు హాస్టళ్లలో గదులు, విండోలకు డోర్లు లేవు. దీంతో విద్యార్థులు చలి, దోమలతో ఇబ్బందులు పడుతూ పడుకుంటున్నారు. మచిలీపట్నంలో హాస్టల్‌లోని టాయిలెట్స్ (మరుగుదొడ్లు, స్నానగదులు)కు డోర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.
బిల్లుల మంజూరులో జాప్యం
కళాశాల విద్యార్థులకు మెస్ బిల్లులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. జూలై నుంచి ఇప్పటి వరకు రూ.లక్షల్లో బిల్లులు ఉన్నా.. రూపాయి కేటాయించలేదు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.52 (మూడు పూటలా తిండి, స్నాక్స్ కలిపి) చెల్లించాలి. ఈ సమస్య బీసీ సంక్షేమంతో పాటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉందని, విద్యార్థులను పస్తులు ఉంచలేక అప్పులు చేసి విద్యార్థులకు పెడుతున్నామని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్లు) చెబుతున్నారు.
జిల్లాలో హాస్టళ్లలో పరిస్థితి ఇలా
మచిలీపట్నంలోని సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయి. సాంఘిక సంక్షేమశాఖ సమీకృత బాలుర వసతిగృహంలో పడుకునే గదులతో పాటు మరుగుదొడ్లు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ తొలగించారు. ఎస్సీ కళాశాల బాలికల వసతిగృహంలో వసతులు అరకొరగానే ఉన్నాయి. బీసీ కళాశాల బాలికల వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 88 మంది విద్యార్థినిలు ఉండగా వారు నేలమీదే పడుకుంటున్నారు. వీరికి దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు.
● అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహం పాత భవనం పూర్తిగా శ్లాబు పెచ్చులూడి ప్రమాదకర స్థితికి చేరింది. విద్యార్థినులు వేరే హాలులోకి వెళ్లి నిద్ర పోతున్నారు. బీసీ బాలుర వసతి గృహం ముందు మురుగు వాసన కొడుతోంది. ఏప్రిల్ తరువాత నుంచి కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం హయాంలో దుప్పటి, బ్లాంకెట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో దుప్పటి ఒక్కటే ఇచ్చి బ్లాంకెట్ ఇవ్వలేదు. నాగాయలంక బీసీ గరల్స్ హాస్టల్‌లో కొన్ని బాత్రూం డోర్లు విరిగి పోయాయి. కోడూరు ఎస్సీ హాస్టల్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. కిటికీలకు డోర్లు లేవు. శ్లాబు పెచ్చులూడి కనిపిస్తోంది.
● పెడనలో బీసీ బాలికల హాస్టల్‌లో వాష్‌రూమ్స్ సక్రమంగా లేవు. వసతి గృహం శిథిలావస్థకు చేరింది. బీసీ బాలుర వసతి గృహంలో సమస్యలు వెంటాడుతున్నాయి. కళాశాల విద్యార్థుల బీసీ వసతి గృహం అద్దె భవనంలో ఉంది. వర్షం వస్తే నీరు కారుతుందని విద్యార్థులు వాపోతున్నారు. కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం బీసీ హాస్టల్‌లో రాత్రి ఎవరూ ఉండటం లేదు.
● గుడివాడ మండలం మోటూరు బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో నాసిరకం భోజనం, కంపుకొడుతున్న మరుగుదొడ్లు విద్యార్థినులకు శాపంగా మారాయి. దోమలు, ఈగలతో వారు ఇబ్బంది పడుతున్నారు.
● పెనమలూరులో ఈడుపుగల్లులోని సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. తాగునీరు తగినంత లేదు. ఆరు వాష్ రూమ్స్‌లో రెండు పంపులే పని చేస్తున్నాయి. గొడవర్రు ఎస్సీ బాలికల వసతిగృహంలో శ్లాబు కారుతోంది. ఉయ్యూరులోని ఏపీ గురుకుల వసతి గృహంలో కిటికీలకు మెష్ డోర్‌లు లేక దోమల ఎక్కువగా ఉన్నాయి.
● గన్నవరంలో సంక్షేమ హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. డైట్ చార్జీలు చెల్లించడం లేదు. టాయిలెట్స్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. బాపులపాడు హాస్టల్ గదులకు తలుపులు, కిటికీలు లేవు. దీంతో దోమల బెడదతో పాటు చలి కాలంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం నాణ్యత లేదని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని నున్నలో ఎస్సీ బాలికల వసతి గృహంలో శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి.
● పామర్రులోని బీసీ హాస్టల్‌లో సక్రమంగా సేవలు అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మొవ్వ మండలంలోని బీసీ ఎస్సీ హాస్టల్లో డైట్ చార్జీలు చెల్లించడం లేదు. కాస్మెటిక్ చార్జీలు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. బెడ్‌షీట్లు, కార్పెట్లను విద్యార్థులకు అందజేయలేదు. దీంతో కొందరు నేలపైన పడుకుంటుండగా, కొందరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
శిథిలావస్థలో భవనాలు, తలుపులు లేని మరుగుదొడ్లు, ఊడిపోయిన కిటికీలు, అర కొరగా నీటి వసతి, అపరిశుభ్ర వాతావరణంతో సమస్యల నిలయాలుగా కనిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు. ఇక్కడ ఇబ్బందులు ఎదురవడంతో విద్యార్థినీవిద్యార్థులకు ‘వసతి’ అసౌకర్యంగా మారింది. నాణ్యమైన ఆహారం అందకపోవడంతో వీటిలో ఉంటున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సంక్షేమ వసతి గృహాలను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి.
నాణ్యమైన భోజనం కరువు టాయిలెట్స్‌కు డోర్లు ఉండవు కళాశాల హాస్టళ్లకు బియ్యం తప్ప బిల్లులు ఇవ్వని ప్రభుత్వం
జిల్లా వసతి గృహాల సమాచారం
వసతి గృహం వసతి కేటాయించిన ప్రస్తుతం
గృహాల సీట్లు విద్యార్థుల
సంఖ్య సంఖ్య
సాంఘిక సంక్షేమ బాలుర 12 1400 641
బాలికల 19 1900 1067
కళాశాల బాలుర 5 500 344
కళాశాల బాలికల 4 400 433
బీసీ సంక్షేమ బాలుర 19 1900 843
బాలికల 8 800 350
కళాశాల బాలుర 7 700 434
కళాశాల బాలికల 9 900 544
మొత్తం 83 8500 4656
Comments
Please login to add a commentAdd a comment