ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 23, 24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం–2025 పై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫొటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 29వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామన్నారు. అందులో ఏమైనా అభ్యంతరాలు, క్లయిమ్‌లు గాని చేయదలచిన వారు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రత్యేక శిబిరాల్లో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవటంతో పాటు చిరునామా, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు బూత్‌స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు వారి బూత్ ఏజెంట్లను కూడా ప్రత్యేక శిబిరాల్లో భాగస్వాములను చేయాలన్నారు. 2025 జనవరి 1వ తేదీన ఓటర్ల జాబితాను పరిశీలించి తాజా సమాచారంతో రూపొందించిన నివేదికను ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపుతామని, అనంతరం జనవరి 6వ తేదీన ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 61,187 దరఖాస్తులు వచ్చాయన్నారు. గతంలో 50 పోలింగ్ కేంద్రాలు ఉండేవని, వీటికి అదనంగా మరో 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తామని, అనంతరం డిసెంబర్ 30వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. బీఎస్పీ ప్రతినిధి బాలాజీ మాట్లాడుతూ హిందూ, హైనీ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 2 వేలకు మించి ఓటర్లు ఉన్నారని, ఇతర పోలింగ్ కేంద్రాలకు మార్చాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డీవోకు సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, షారోన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment