రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రజాస్వామ్యానికి మూలస్తంభం రాజ్యాంగమేనని ఎస్పీ ఆర్.గంగాధర రావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీని గుర్తు చేసుకుంటూ ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులను గౌరవిస్తూ, నిరంతరం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అధికా రులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, పలువురు డీఎస్పీలు, సీఐలు, జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
అందరికీ ఆదర్శనీయుడు అంబేడ్కర్
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీయుడని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలతో ముడిపడి ఉన్న భారత సమాజం 75 ఏళ్లుగా ఒక్కతాటిపై ఉండటానికి కారణం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమని పేర్కొన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యుడు ఎన్.ఉష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ స్వరూప, డాక్టర్ రవి, డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ కవిత, డాక్టర్ శాంతికృప తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment