మధ్యాహ్న భోజనానికి ధరల మంట
గుడ్లవల్లేరు: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ ప్రశ్నార్థకమవుతోంది. వంట ఏజెన్సీల వర్కర్లకు పెను భారంగా పరిణమిస్తోంది. దానికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటులా గౌరవ వేతన బకాయిలు, కుకింగ్ కాస్ట్ బకాయిలను కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. జిల్లాలో 1,349 వంట ఏజెన్సీలు ఉంటే... అందులో 2,255 మంది వంట ఏజెన్సీ వర్కర్లు పని చేస్తున్నారు. విద్యార్థి తల ఒక్కింటికి కుకింగ్ కాస్ట్ వచ్చేసరికి ఎంత పని చేసినా...తోక బెత్తిడే అన్న చందంగా ధరలు పెరగక ముందు ఉన్న రేట్లనే చెల్లించాలని ప్రభుత్వం చూస్తోంది. కాని వాస్తవ రూపంలోకి వచ్చి ప్రస్తుత నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయో పరిశీలించి తమకు కుకింగ్ కాస్ట్‌ను కేటాయించాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. వంట ఏజెన్సీలో ఒక్కో వర్కర్‌కు నెలకు రూ.3వేల చొప్పున ప్రభుత్వం వర్కర్లకు గౌరవ వేతన బకాయిలను చెల్లించవలసి ఉంది. కాగా 1–8వ తరగతి వరకు సెప్టెంబరులో వేతనం రూ.3వేలలో కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి వాటా మాత్రమే చెల్లిం చింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2వేలను చెల్లించవలసి ఉంది. 2005 నుంచి అయితే 9–10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఎలాంటి వేతనాలను ఇవ్వకుండానే 19 ఏళ్లుగా వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వంట ఏజెన్సీల వర్కర్లు మధ్యాహ్న భోజన తయారీలకు ఏర్పాటు చేసిన వంట షెడ్లకు కూటమి ప్రభుత్వం నిధులు నిలిపివేసి మరుగున పడేసింది. దీనితో వర్కర్లు తమ వంటలను ఇరుకు షెడ్లలో, చెట్ల కింద చేసుకుంటున్నారు. తమ డిమాండ్లపై కూడా గళమెత్తుతున్నారు.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు... జిల్లాలో 1,349 వంట ఏజెన్సీలు 2,255 మంది వంట ఏజెన్సీ వర్కర్లు సరిగా అందని గౌరవ వేతనం, కుకింగ్ కాస్ట్ బకాయిలు ఏజెన్సీల వర్కర్లకు భారంగా మారిన వైనం
రూ.1.25 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వంట చేసేందుకు ప్రభుత్వం ఇచ్చే కుకింగ్ కాస్ట్ కూడా అందటం లేదు. 1–8వ తరగతి విద్యార్థులకు సెప్టెంబరు కుకింగ్ కాస్ట్ బిల్లులు రావలసి ఉంది. అక్టోబరులో అయితే 1–10వ తరగతి వరకూ కూడా బిల్లులు రాలేదు. పాత ధరలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కుకింగ్ కాస్ట్‌ను ఇవ్వటం అన్యాయమని వర్కర్లు వాపోతున్నారు. భోజన తయారీకి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తల ఒక్కింటికి రూ.8.57 అయితే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కుకింగ్ కాస్ట్‌ను రూ.15నుంచి రూ.20కు పెంచాలని కోరుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెనూకు అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు గౌరవ వేతనాలు, భోజన తయారీకి అయ్యే ఖర్చు చెల్లించేవారని, ఆ మెనూను బట్టి పాఠశాలలకు పిల్లలు వచ్చేందుకు ఆసక్తి చూపేవారని అంటున్నారు. ఇపుడు పెరిగిన ధరలపై ఆ మెనూని ఇవ్వలేమని అంటున్నారు. వేతన బకాయిలు, కుకింగ్ కాస్ట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని డీఈఓ పి.వి.జె.రామారావు వివరణ ఇచ్చారు. త్వరలో వాటిని చెల్లిస్తామని చెప్పారు. వేతన బకాయిలు, కుకింగ్ కాస్ట్ బిల్లులు వెరశి రూ.1.25 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment