ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి
మచిలీపట్నంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఈ విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు దుయ్యబట్టారు. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్‌లు, సంయుక్త కిసాన్ మోర్చ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోనేరుసెంటర్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజా ధనాన్ని దోచిపెట్టిందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడం లేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన స్కీం కార్మికులైన అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజన తయారీ కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ టి.తాతయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు జి.రాంబాబు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమా దేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం తయారీ, వెలుగు నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ తదితర పథకాలలో పని చేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సహాయం అందించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు సెంటర్లో నిర్వహించిన సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్లెం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత రైతు సంఘం జిల్లా నాయకుడు గౌరిశెట్టి నాగేశ్వరరావు రాజ్యాంగ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ నాగేంద్రం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీపీ రెడ్డి, కోశాధికారి బి.సుబ్రహ్మణ్యం, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి.ధనశ్రీ , సీపీఎం నాయకులు కొడాలి శర్మ, ఏఐటీయూసీ నాయకుడు లింగం ఫిలిప్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ సంయుక్త మోర్చ, కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు నగరంలో నిరసన ర్యాలీ, బహిరంగ సభ
Comments
Please login to add a commentAdd a comment