జిల్లా పరిశ్రమల కేంద్రం
ఉపాధి విప్లవ సారథులకు ఆదరణ ఏదీ
ఆరు నెలల్లో ఎంఎస్‌ఎంఈలకు 1,766 దరఖాస్తులు
కూటమి నేతల సిఫార్సు ఉన్న 105 మందికే రుణాలు
నాడు ఎంఎస్‌ఎంఈలకు వైఎస్సార్ సీపీ అధిక ప్రాధాన్యం
సాక్షి, మచిలీపట్నం: ప్రోత్సహిస్తేనే ఏ రంగంలో అయినా పురోగతి. ప్రధానంగా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు యువత ఆసక్తి చూపుతున్నా పాలకుల ప్రోత్సాహం కరువవుతోంది. ఉన్నత చదువులు చదివినా.. సరైన ఉద్యోగావకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని, సొంత ఊరిని వదిలి సుదూర ప్రాంతానికి వెళ్లలేక, ఒకరి కింద చేతులు కట్టుకొని పని చేయలేక కొందరు యువకులు సొంతంగా పరిశ్రమల స్థాపన వైపు అడుగులు వేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ, బ్యాంకుల సాయంతో వీటి ఏర్పాటుకు యత్నాలు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వ స్పందన, ఆదరణ కరువైంది. మరోవైపు కూటమి నేతల సిఫార్సులున్న వారికే మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
1,766 దరఖాస్తులు.. 105కే అనుమతులు
జిల్లాలో గత ఆరు నెలల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు 1766 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కూటమి నేతల సిఫార్సులున్న వారికే గ్రీన్ సిగ్నల్ లభిస్తోందని తెలుస్తోంది. మొత్తం దరఖాస్తుల్లో కేవలం 154 మాత్రమే బ్యాంకులకు పంపించారు. వాటిలో 105 మాత్రమే అర్హులుగా తేల్చి, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిచ్చారు.
సిఫార్సుతో రాయితీ
ఎంఎస్‌ఎంఈల ఏర్పాటులో కూటమి నేతలు చక్రం తిప్పుతున్నారు. తమ సిఫార్సులు ఉన్న వారికే పనులు చేసి పెట్టేలా ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో 105 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కాగా కేవలం 25 మందికి మాత్రమే మార్జిన్ మనీ మంజూరవగా కేవలం రూ.1.33లక్షలు మాత్రమే విడుదల కావడం గమనార్హం. ప్రభుత్వ తీరుతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఉపాధి, మరి కొందరికి ఉద్యోగం
ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసుకున్న యువతకు స్వయం ఉపాధి లభిస్తోంది. దీంతో పాటు చేసే ఉత్పత్తులు, ప్యాకింగ్, మార్కెటింగ్, సేల్స్ తదితర అంశాల మేరకు మరి కొంత మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో వీరు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్య మిచ్చింది. జిల్లాలో రూ.772.73 కోట్లతో 5,579 మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు ఏర్పాటు చేసింది. దీంతో 19,935 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. బాపులపాడు మండలంలో రూ.6కోట్ల పెట్టుబడితో నాలుగు లార్జ్, అండ్ మీడియం పరిశ్రమలు ఏర్పాటు చేయగా 2,300 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి.
యువతను ప్రోత్సహించాలి
మైక్రో, స్మాల్, మీడియ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వరిస్తాయి. దీంతో నిరుద్యోగ శాతం తగ్గుతుంది. కుటుంబ సభ్యులను, సొంత ఊరిని వదిలి ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు. స్థానికంగానే ఉండి ఉపాధి పొందే అవకాశాలున్న ఎంఎస్‌ఎంఈలు చాలా అవసరం. వీటిని ఏర్పాటు చేసే యువతను ప్రోత్సహించాలి.
– లింగం ఫిలిప్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
నిర్లక్ష్యం వీడాలి
చిన్న పరిశ్రమల ఏర్పాటుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఎంతో మంది చదువుకున్న యువత సొంతంగా పరిశ్రమ ఏర్పాటు చేసుకొని తమ ప్రతిభ, మేధస్సుతో భవిష్యత్తులో రాణించాలని ఆసక్తితో ఉన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అనుమతుల ఇవ్వడంలో జాప్యం తగదు.
– బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా కోశాధికారి
ఆరు నెలల వివరాలు ఇవి
1766 ఎంఎస్‌ఎంఈలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య
154 బ్యాంకులకు పంపిన దరఖాస్తులు
105 లోనుకు అర్హత పొందినవి
105 ఏర్పాటు చేసిన పరిశ్రమలు
రూ.4.56కోట్లు బ్యాంకులు ఇచ్చిన రుణాలు
25 మార్జిన్ మనీ వచ్చిన పరిశ్రమలు
రూ.1.33కోట్లు విడుదలైన మొత్తం
Comments
Please login to add a commentAdd a comment