మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన కోనేరు స్థలంలో చేస్తున్న రూములు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. దేవదాయశాఖ డీఈఈ గోపాలకృష్ణరాజు మంగళవారం నిర్మాణపనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం నిథులు రూ. 2.75 కోట్లతో జీ+2తో కింద షాపులు, పైన రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 1.20 కోట్లతో కేశఖండనశాల, టాయిలెట్స్ రూముల నిర్మాణానికి టెండర్ ఖరారైందని, త్వరలో వాటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాల్సిందని కాంట్రాక్టర్‌కు సూచించినట్లు వివరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు, దేవదాయశాఖ ఏఈఈ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
21 నుంచి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీలను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉండి ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఏఐ) గుర్తింపు కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 95535 28888లో సంప్రదించాలని సూచించారు.
నాయీబ్రాహ్మణ సంఘాల నూతన కమిటీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ ఆలయాల నాయీ బ్రాహ్మణ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ జేఎసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక మంగళవారం విజయవాడలో జరిగింది. చెరువు సెంటర్‌లోని కోదండరామస్వామి కల్యాణ మండపంలో కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ప్రముఖ ఆలయాల్లో కేశఖండన శాలల్లో విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు హాజరయ్యారు. తొలుత నూతన కమిటీ ఎన్నిక ప్రతిపాదన చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పెనుగంచిప్రోలు ఆలయానికి చెందిన బ్రహ్మం, గౌరవ సలహాదారులుగా సింహాచలం దేవస్థానానికి చెందిన రాము, అధ్యక్షుడిగా దుర్గగుడికి చెందిన చెందిన గుంటుపల్లి రామదాసు, ప్రధాన కార్యదర్శిగా ఏలూరి శ్రీనివాసరావు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.
దుర్గమ్మ భక్తులకు బ్యాటరీ వాహనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగుల కోసం సిటీ యూనియన్ బ్యాంక్ రూ. 6.88 లక్షలతో బ్యాటరీ వాహనాన్ని దేవస్థానానికి అందజేసిందని ఈవో కె.ఎస్.రామరావు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై డోనర్ సెల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాటరీ వాహనానికి ఈవో రామరావు, బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేమూరి రమేష్‌కుమార్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 6 సీట్ల సామర్థ్యమున్న 150 ఎహెచ్ బ్యాటరీ వాహనాన్ని బ్యాంక్ దేవస్థానానికి విరాళంగా అందచేయడం అభినందనీయమని ఈవో అన్నారు. భక్తుల సేవ అంటే అమ్మవారి సేవతో సమానమని, వృద్దులు, దివ్యాంగుల కోసం బ్యాంక్ అందించిన వాహనాన్ని నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. దీక్ష విరమణలకు విచ్చేసే వృద్ధులు, దివ్యాంగులకు సేవ అందిస్తామన్నారు. స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, బ్యాంక్ మేనేజర్ హరిహరన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment