సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
సాక్షి, మచిలీపట్నం: సమష్టి కృషితో కృష్ణా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2024లో జిల్లా సాధించిన ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికలను సమర్థంగా నిర్వహించామన్నారు. కృష్ణా, బుడమేరు వరదలను ప్రణాళికతో ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ప్రజలకు గడుపులోగా రెవెన్యూ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో 1,155 అర్జీలు వచ్చాయని, వీటిలో 606 పరిష్కరించామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 3.50 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్, గన్నవరం విమానాశ్రయం, మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా మూడో శుక్రవారం ఎంప్లాయి గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, విధి నిర్వహణలో మరణించిన 39 మందికి సంబంధించి వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. స్టేట్ బ్యాంకులో శాలరీ ఖాతా ఉన్న ఉద్యోగులకు ఎస్బీఐ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో కె.చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment