పెడన కలంకారీకి పూర్వ వైభవం తెద్దాం
పెడన: కలంకారీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం ఆయన పెడన శివారులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న స్థలంతో పాటు హిందూ శ్మశాన వాటిక పక్కన గల డంపింగ్ యార్డుకు కేటాయించిన మున్సిపల్ భూములను స్థానిక అధికారులతో పాటు చేనేత జౌళి, పరిశ్రమల శాఖ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కలంకారి క్లస్టర్ ఏర్పాటు చేయడం వల్ల పెడనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు సుమారు ఏడెకరాలు స్థలం అవసరమవుతుందన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, మచిలీపట్నం ఆర్డీవో కె స్వాతి, ఇన్‌చార్జి తహసీల్దారు కె. అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం. గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులోకి కలెక్టర్ రావడంతో ఆ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఖాజా కలెక్టర్‌కు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment