కొండపై కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము న అమ్మవారి సన్నిధిలోని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద భోగిమంటలు వేశారు. తొలుత ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, దేవదాయశాఖ అదనపు కమిషనర్, దుర్గగుడి ఈవో కె.రామచంద్రమోహన్, డీఈవో రత్నరాజు పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని మామిడి తోరణాలు, అరటి బోదెలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక మహామండపం రాజగోపురం ఎదుట బసవన్నల విన్యాసాలు, హరిదాసుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజగోపురం ఎదుట ధాన్యాగారం, రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తు న భక్తులు తరలివచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చేసిన ఏర్పాట్ల వద్ద భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కనిపించారు.
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ..
పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులు అధిష్టించిన ప్రత్యేక వాహనానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఆలయ ఈవో రామచంద్రమోహన్ కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగుస్తంభాలు, విద్యాధరపురం, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, బ్రాహ్మణవీధి మీదుగా ఆలయానికి చేరింది. గిరి ప్రదక్షిణలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులతోపాటు ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సిబ్బంది, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
ముగిసిన కల్యాణోత్సవం..
ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శివకామ సుందరీ సమేత నటరాజస్వామి వారి కల్యాణోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించగా ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన శివకామ సుందరీ సమేత నటరాజస్వామి వారి నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది.
దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment