తగ్గేదేలే!
సాక్షి,ప్రతినిధి, విజయవాడ: సాక్షి,ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేలు, జూద క్రీడలు, క్యాసినో ఆడేందుకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భోగి పండుగ రోజు నుంచి జోరుగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. బరుల్లో క్యాసినో తరహా జూద క్రీడలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గుండాట, పేకాట, కోతముక్క, చిన్నబజారు, పెద్ద బజారు, లోన, బయట, కాయ్ రాజా కాయ్ అంటూ పెద్ద ఎత్తున జూద క్రీడలు సాగుతున్నాయి.
ఫ్లడ్ లైట్లు.. డ్రోన్లు..
రేయింబగళ్లు పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డ్రోన్లు, ఆధునికీకరణ సీసీ కెమెరాలతో బరుల వద్ద నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు. అతిథులకు సరికొత్త రుచులు అందించేలా ప్రత్యేకంగా వంట మనుషులను తెప్పించారు. పందెపు రాయుళ్లను ఆకర్షించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా స్క్రీన్లతో లైవ్ ఏర్పాటు చేస్తున్నారు.
అయ్యారే అంపాపురం..
గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో 20 ఎకరాల్లో భారీ బరి, అందులో వీవీఐపీలకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. కోడి పందేల కోసం 01, క్యాసినో కోత ముక్క కోసం 02 వీవీఐపీల కోసం బరులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఎల్‌ఈడీ స్క్రీన్లలతోపాటు, ఏసీలు, కూలర్లతో ప్రత్యేక వసతులు కల్పించారు. వీవీఐపీ కోడిపందేలు బరిలోకి వెళ్లేందుకు రూ. లక్ష, కోతముక్క, క్యాసినోలోకి వెళ్లేందుకు రూ. పది లక్షలు ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. రూ.50 ప్రవేశ రుసుముతో కోడిపందేల బరులు 05, కోత ముక్క బరులు 10 ఏర్పాటు చేశారు. విచ్చల విడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. రామవరప్పాడులో 16 ఎకరాల్లో, ఎనికేపాడు, కొత్తూరు తాడేపల్లి, అంబాపురంలలో బరులు వెలిశాయి. విచ్చలవిడిగా క్యాసినో జూద క్రీడలు, మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. బరుల నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.30లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా పరిధిలో..
● పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు మండలం యనమలకుదురు, పెదపులిపాక, పోరంకి, కంకి పాడు మండలం ఈడుపుగల్లు, ఉప్పలూరు, గొడవర్రు, కంకిపాడులోని రెండు ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగులతో పందెం రాయుళ్లను ఆకర్షిస్తున్నారు. ఇక్కడ రూ.2లక్షల నుంచి గరిష్టగా రూ.10 లక్షల వరకు పందేలు వేస్తున్నారు.
● గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ మండలం బొమ్ములూరు, వలివర్తిపాడు, నందివాడ మండలం పోలుకొండ, రుద్రపాక, తమిరిశ, గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు, భీమవరం, కూరాడ, పెంజెండ్ర (డోకిపర్రు) ప్రాంతాల్లో జోరుగా పందేలు సాగుతున్నాయి.
● పామర్రు మండలంలోని కొత్త పెద్దమద్దాలి, పెద పారుపూడి మండలం యలమర్రు, పమిడిముక్కల మండలంలో కపిలేశ్వరపురం, హనుమంతపురం, తోట్లవల్లూరు మండలంలో తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, గరికపర్రు, కుమ్మమూరు, మొవ్వ మండలంలోని కోసూరు, బట్లపెనుమర్రు గ్రామాల్లో బరులు నిర్వహిస్తున్నారు.
● మచిలీపట్నం పరిధిలో గల మంగినపూడి బీచ్ రోడ్డులో మూడు బరులు ఏర్పాటు చేశారు. గుండాట, కోతముక్క, కోడిపందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
● పెడన నియోజకవర్గంలోని పెడన మండలం తోటమూల, పల్లోటి హైస్కూల్ వెనుక, కొంకేపూడి జాతీయ రహదారి పక్కన బరులు ఏర్పాటు చేశారు. బంటుమిల్లిలో పెద్ద తుమ్మిడి, ఆర్తమూరు, కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం, పల్లెపాలెం, గూడూరు మండలం పెడన–గూడూరు అడ్డరోడ్డు వద్ద, పోసిన వారిపాలెంలో బరులు నిర్వహిస్తున్నారు.
● అవనిగడ్డ మండలంలోని అవనిగడ్డలో రెండు, పులిగడ్డ, కోడూరు కేంద్రంగా మూడు, నాగాయలంకలో రెండు, టి.కొత్తపాలెంలో ఒకటి, గణపేశ్వరం ఒకటి, మోపిదేవి మండలంలో రావివారిపాలెం, మోపిదేవి వార్పు, చల్లపల్లిలో నడకుదురు, రామానగర్, ఘంటసాల మండలం లంకపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీ సెట్టింగులతో బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ. 10 కోట్లు మేరకు చేతులు మారే అవకాశం ఉంది.
సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల ‘బరి’తెగింపు ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బరుల ఏర్పాటు ఒక్కో బరి ఏర్పాటుకు రూ.30లక్షల నుంచి రూ. 2కోట్లకు పైగా వసూలు కోడి పందేలతోపాటు, క్యాసినో తరహా జూద క్రీడలు విచ్చల విడిగా మద్యం దుకాణాలు పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు
ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా జూద క్రీడలు
ముడుపులే ముడుపులు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. పందేలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నా వీటిని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. నియోజక వర్గ ప్రజా ప్రతినిధులకు భారీగా ముడుపులు అందటంతో వీరు వాటిని ప్రోత్సహస్తున్నారు. రెవెన్యూ, పోలీసులు బరి స్థాయి బట్టి రేటు నిర్ణయించి, భారీ సంఖ్యలో ముడుపులు దండుకుంటున్నారు. దీంతో వారు సైతం బరుల వైపు కన్నెత్తి చూడకుండా, అవి భారీ ఎత్తున జరిగేలా బరి నిర్వాహకులకు, కోడి పందేపు రాయుళ్లకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇంత పెద్ద సెట్టింగ్‌లతో హైటెక్ బరులు ఏర్పాటు చేస్తే పోలీసు ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసులకు తెలియకుండా ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పందెం కోడి కాలు దువ్వింది.. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ దూసుకెళ్లింది.. కూటమి నేతలే ‘బరి’తెగించడంతో యథేచ్ఛగా ‘కోట్లా’డుతోంది. మద్యం ఏరులై పారుతోంది. క్యాసినో తరహా జూద క్రీడలు జూలు విధిల్చుకొని పందెం రాయుళ్ల చేతి చమురు వదిలిస్తున్నాయి. రూ. కోట్లలో చేతులు మారుతున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలు చేస్తూ హైటెక్ పందేలు నిర్వహిస్తున్నారు. పండుగకు ముందు హడావుడి చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు చివరికి వచ్చేసరికి చేష్టలుడిగి ఉండిపోయారు.
విజయవాడ రూరల్ అంబాపురంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద హడావుడి ఇది
రామవరప్పాడు బరి వద్ద స్పాట్ క్యాష్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment