జోసఫ్ తంబి జీవితం ఆదర్శప్రాయం
ఘనంగా ప్రారంభమైన తంబి వర్ధంతి మహోత్సవాలు
ఉంగుటూరు: బ్రదర్ జోసఫ్ తంబి తన ఆదర్శవంతమైన జీవితం ద్వారా దైవ రాజ్యసువార్తను ప్రకటించారని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా పొవిన్షియల్, మేరీమాత కపూచియన్ ఫాదర్ ప్రత్తిపాటి మరియదాసు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి 80వ వర్ధంతి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7గంటలకు మరియదాసు కథోలిక మత గురువులతో కలసి సమష్టి దివ్యపూజాబలిని సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్ధేశించి ప్రసంగించారు. తంబి క్రీస్తునందు విశ్వాసంతో జీవించి అనేక మందికి సువార్తను ప్రకటించి రక్షణ కల్పించారన్నారు. తంబి ధన్యమరణం పొంది తన మధ్యస్త ప్రార్థన ద్వారా ఇప్పటికీ ఎంతోమందికి మేలును చేస్తున్నారని పేర్కొన్నారు. దానికి నిదర్శనమే దేశంలోని రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది విశ్వాసులు ఆయన సమాధి వద్ద మొక్కుబడులు చెల్లించుకుంటున్నారన్నారు. విజయవాడ మేత్రాసనం జ్యోతిర్మయిమాత ఉప దేశుల బృందం ‘మృత్యుంజయుడు’ బుర్రకథను వినిపించారు. ఉదయం 10.30గంటలకు ఫాదర్ బీమ్లా ప్రేమ్ కుమార్, మధ్యాహ్నం ఫాదర్ దాసరి జోసఫ్ తంబి, సాయంత్రం 5గంటలకు ఫాదర్ గుదె ఉదయ మీన వరప్రసాద్(ఓఎఫ్‌ఎం, యూఎస్‌ఏ) సమష్టి దివ్యబలిపూజను సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment